Site icon NTV Telugu

PM Modi: వికసిత్ భారత్ దిశగా ఇండియా..: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: 2025 సంవత్సరం భారతదేశానికి ఒక మైలురాయి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో అమలు చేసిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ‘రిఫారమ్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో తాజాగా ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పలు అంశాలను పోస్ట్‌ చేశారు. ఈ సంస్కరణలు 2047 నాటికి ‘వికసిత భారత్’ను సాకారం చేయడానికి మార్గం సుగమం చేస్తాయని చెప్పారు. 13 కీలక రంగాల్లోని అమలు చేస్తున్న సంస్కరణలను ఆయన వివరించారు.

READ ALSO: Siddipet: సిద్దిపేట జిల్లాలో అడవి పులి ఉద్రిక్తత, గ్రామాల్లో భయాందోళన.!

ఈ సంస్కరణలు మధ్యతరగతి, రైతులు, కార్మికులు, యువత, చిన్న వ్యాపారాలకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. ఈ సంస్కరణలు దేశాన్ని స్వావలంబన వైపు నడిపిస్తున్నాయని వెల్లడించారు. పన్నుల్లో పెద్ద మార్పు అనేది మధ్యతరగతికి పెద్ద ఊరట కలిగించిందన్నారు. పన్నుల విషయంలో 2025లో కేంద్ర ప్రభుత్వం రెండు పెద్ద సంస్కరణలు తీసుకొచ్చింది. ముందుగా GSTలో రెండు స్లాబ్‌లు (5%, 18%) అమలు చేశారు. ఇది గృహాలు, చిన్న వ్యాపారాలు, రైతులు, కార్మిక రంగాలపై భారాన్ని తగ్గించింది. రెండోది ఆదాయపు పన్ను ఉపశమనం. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు. 1961 ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌ను రద్దు చేసి, కొత్త 2025 యాక్ట్ తెచ్చారు.

వ్యాపారాలకు సులభత విధానం తీసుకొని వచ్చింది. ఇది చిన్న కంపెనీలకు బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ‘స్మాల్ కంపెనీలు’ నిర్వచనాన్ని విస్తరించారు. రూ.100 కోట్ల టర్నోవర్ వరకు ఉన్నవాటికి కంప్లయెన్స్ ఖర్చులు తగ్గాయి. దీంతో వేలాది కంపెనీలు సులభంగా నడుస్తున్నాయి. అలాగే ఇన్సూరెన్స్ రంగంలో 100% FDIకి అనుమతి ఇచ్చారు. ఇది పోటీని పెంచి, సేవలను మెరుగుపరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సెక్యూరిటీస్ మార్కెట్‌లో కొత్త బిల్ తెచ్చి, SEBI గవర్నెన్స్‌ను బలోపేతం చేశారు. ఇన్వెస్టర్ల రక్షణ, తక్కువ ఖర్చులు.. ఇవన్నీ వికసిత భారత్‌కు బలమైన పునాదిగా కేంద్రం పేర్కొంది. ఇదే టైంలో సముద్ర రంగంలో ఐదు కొత్త చట్టాలు (బిల్స్ ఆఫ్ లాడింగ్ యాక్ట్, క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ మొదలైనవి) అమలు చేశారు. పాత 1908, 1925 చట్టాలను రద్దు చేసి, డాక్యుమెంటేషన్ సులభం చేశారు.

జన్ విశ్వాస్ సంస్కరణల్లో 71 పాత చట్టాలను రద్దు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 22 క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లను రద్దు, 53ను సస్పెండ్ చేశారు. దీంతో ఫుట్‌వేర్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ధరలు తగ్గాయి, అదే టైంలో ఎగుమతులు పెరిగాయి. అంతర్జాతీయంగా న్యూజిలాండ్, ఓమన్, బ్రిటన్‌తో ట్రేడ్ డీల్స్, యూరోపియన్ FTA అమలు.. ఇన్వెస్ట్‌మెంట్లు, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ హయాంలో కార్మిక సంస్కరణలు చరిత్రాత్మకంగా చెబుతారు. 29 చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చారు. ఫెయిర్ వేజెస్, సమయానుకూల పేమెంట్లు, సామాజిక భద్రత, వంటివి అమలు చేయడం ప్రాధాన్యం పొందాయి. అసంఘటిత కార్మికులకు ESIC, EPFO కవరేజ్ కల్పించడం, రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీని 100 నుంచి 125 రోజులకు పెంచారు.

వికసిత భారత్-గ్రామ్ జి యాక్ట్ ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. అలాగే న్యూక్లియర్ ఎనర్జీలో SHANTI యాక్ట్ తెచ్చి, సురక్షిత విస్తరణకు మార్గం సుగమం చేశారు. AI యుగంలో డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్‌కు ఇది కీలకంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎడ్యుకేషన్‌లో UGC, AICTE, NCTEలను భర్తీ చేసి, వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇన్‌స్టిట్యూషన్ల స్వయంప్రతిపత్తి, ఇన్నోవేషన్ పెరుగుతాయని విశ్వసిస్తున్నారు. ఈ సంస్కరణలు కేవలం చట్టాలు మాత్రమే కాదని.. దేశ ప్రజల జీవితాల్లో విప్లవం అని ప్రధాని మోదీ అన్నారు. 2025లో వెలుగు చూసిన ఈ మార్పులు భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ 2047 కల కాదు.. వాస్తవం అని ప్రధాని పేర్కొన్నారు.

READ ALSO: Suriya: ఫ్యాన్ పెళ్లికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్‌గా స్టార్ హీరో.. వైరల్‌గా మారిన వీడియో

Exit mobile version