Ben Stokes: జూలై 2న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఇంగ్లాండ్, భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఐదు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలి టెస్టులో పరాజయం పాలైన గిల్ సేన, రెండో టెస్టులో గట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. ముఖ్యంగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆటతీరు మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది.
ఈ టెస్టులో గిల్ ప్రత్యర్థి బౌలర్లకు భయాందోళన కలిగించేలా, మరోవైపు పురాతన టెస్టు రికార్డులను తుడిచిపెట్టేలా బ్యాటింగ్ చేశాడు.
గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతుల్లో 269 పరుగులు (30 ఫోర్లు, 3 సిక్సులు) చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 162 బంతుల్లో 161 పరుగులు (13 ఫోర్లు, 8 సిక్సులు) చేశాడు. మొత్తం కలిపితే 430 పరుగులతో టెస్టు చరిత్రలో ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా గిల్ నిలిచాడు.
Read Also:Weather Report: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..!
ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమిండియా గురించి స్పందిస్తూ.. “టీమిండియా ఓ క్లాస్ టీమ్. వారితో ఆడేటప్పుడు ఇలాంటి పరిస్థితులు సహజమే అని అన్నాడు. ఇక గిల్ గురించి మాట్లాడుతూ.. అతను చాలా గొప్పగా ఆడాడు. మేమంతా శారీరకంగా, మానసికంగా అలసిపోయేలా చేశాడని.. గంటల తరబడి క్రీజులో ఉండటంతో మాకు నిజంగానే ఇప్పుడు ‘రెస్ట్’ అవసరం అని అన్నాడు.
ఈ గెలుపుతో టీమిండియా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో 58 ఏళ్ల తర్వాత మొదటి టెస్టు విజయం నమోదు చేసింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ మైదానంలో గెలవని భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో మెరిసింది. ఇక రెండు ఇన్నింగ్స్‌ల్లో అత్యద్భుత ప్రదర్శన చూపించిన శుబ్‌మన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గిల్ ఈ విజయంలో తన నాయకత్వ నైపుణ్యాన్ని, ఆటతీరు ద్వారానే కాకుండా జట్టు బలాన్ని పెంచేలా చూపించాడు.
Read Also:YS Jagan: నేటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. రేపు ఇడుపులపాయకు మాజీ సీఎం..
ఈ ఓటమి అనంతరం స్టోక్స్ జట్టు లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో టెస్టుకు ఎదురు చూస్తున్నామని వెల్లడించింది. టీమిండియా విజయం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో మూడో టెస్టుకు సిద్ధమవుతుండగా, ఇంగ్లాండ్ మాత్రం గిల్ ఉచ్చు నుండి ఎలా బయటపడాలని ఆలోచనలో ఉంది.
