T20 World Cup boycott: బంగ్లాదేశ్ తరహాలో పాకిస్థాన్ కూడా 2026 టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించాలా? అనే అంశంపై ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టతనిచ్చింది. టోర్నమెంట్ నుంచి వైదొలగే ఆలోచన తమకు లేదని పీసీబీ ఖరాఖండిగా ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నమెంట్‌ను బహిష్కరిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను పీసీబీ వర్గాలు తోసిపుచ్చాయి.
Read Also: Peddi : ‘పెద్ది’ మాస్ జాతర మొదలైంది.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!
మీడియా కథనాల ప్రకారం, బంగ్లాదేశ్ దౌత్యపరమైన మరియు క్రికెట్ పరమైన మద్దతు కోసం పాకిస్థాన్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అయినప్పటికీ, పాకిస్థాన్ మ్యాచ్‌లు పూర్తిగా శ్రీలంకలోనే షెడ్యూల్ కావడంతో, టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని పీసీబీ స్పష్టం చేసింది.
అసలు వివాదానికి కారణం ఇదే..!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన గ్రూప్ దశ మ్యాచ్‌లను భారతదేశంలో ఆడటానికి నిరాకరించడం ఈ వివాదానికి దారితీసింది. భద్రతా కారణాలు, ఆటగాళ్ల సురక్షితంపై ఆందోళనలతో భారత్‌కు జట్టును పంపలేమని బీసీబీ అభిప్రాయపడింది. మరోవైపు, ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ కాంట్రాక్ట్ రద్దు తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ వెంటనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారతదేశం నుంచి వేరే వేదికలకు మార్చాలని బీసీబీ అధికారికంగా ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ భద్రతా సమీక్షలో భారత వేదికల వద్ద ముప్పు చాలా తక్కువగా ఉందని తేలడంతో బంగ్లాదేశ్ వాదన బలహీనపడింది.
గ్రూప్ మార్పుపై బంగ్లాదేశ్ ఆలోచన..!
బంగ్లాదేశ్ ప్రస్తుతం గ్రూప్ Cలో ఉంది. ఇందులో కోల్‌కతాలో మూడు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్‌లో ఆడకూడదనే ఉద్దేశంతో, ఐర్లాండ్‌తో గ్రూప్‌ల మార్పు ప్రతిపాదనను బీసీబీ పరిశీలిస్తోంది. అలా జరిగితే, శ్రీలంకలో మ్యాచ్‌లు జరిగే గ్రూప్ Bకి బంగ్లాదేశ్ మారే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, శ్రీలంకలో వేదికలు అందుబాటులో లేకపోతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు సిద్ధమని పాకిస్థాన్ ఐసీసీకి ప్రతిపాదించినట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
ఐసీసీ నిర్ణయం కీలకం
అయితే, ఈ దశలో టోర్నమెంట్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలనే ఆలోచన ఐసీసీకి లేదని తెలుస్తోంది. గ్రూప్ మార్పు జరిగితే ఐర్లాండ్‌కు ఎలాంటి లాజిస్టిక్ సమస్యలు ఉండవని కూడా ఐసీసీ స్పష్టం చేసింది.. ఇప్పుడు తుది నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేతుల్లోనే ఉంది. జనవరి 21 సాయంత్రం 6.30 గంటలలోపు తమ నిర్ణయాన్ని ఐసీసీకి తెలియజేయాల్సి ఉంది. టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే, పాయింట్ల నష్టం, భారీ ఆర్థిక జరిమానా, ఐసీసీ ఆదాయ వాటాలో కోత వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
