CM Chandrababu Meets Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్ లోని డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లారు. కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని తెలిపారు. పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని, ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్లు వివరించారు. అయితే.. ఇద్దరూ గంటకు పైగా పలు అంశాలపై మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రివర్యులు ఆకాంక్షించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రస్తావించారు.
READ MORE: Karur Stampede : గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్
ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రివర్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో…’ కార్యక్రమంపై చర్చించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని, తద్వారా మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతోందని సీఎం తెలిపారు. ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక భరోసాను కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని, 4 వ తేదీన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసిన, చేపట్టిన ఈ పథకం కూడా కచ్చితంగా అందరి మన్ననలు పొందుతుందనే విశ్వాసాన్ని డిప్యూటీ సీఎం వ్యక్తపరిచారు. అక్టోబర్ 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించుకున్నారు. జి.ఎస్.టి. సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న రోడ్ షో నిర్వహణ, అందుకు సంబంధించిన ప్రణాళికల ప్రస్తావన వచ్చింది.
