Site icon NTV Telugu

Passport Ranking 2026: విడుదలైన 2026 పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్.. భారత పాస్‌పోర్ట్ పవర్ పెరిగిందా, తగ్గిందా?

Passport Ranking 2026

Passport Ranking 2026

Passport Ranking 2026: తాజాగా 2026 పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే స్వేచ్ఛ ఒక దేశం యొక్క బలానికి ప్రధాన సూచికగా మారింది. దీని ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 యొక్క కొత్త ర్యాంకింగ్ మరోసారి ప్రపంచ శక్తి సమతుల్యతను వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఈ ఏడాది సింగపూర్ పాస్‌పోర్ట్ గుర్తింపు సొంతం చేసుకుంది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తి వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. సింగపూర్ తర్వాత, జపాన్ – దక్షిణ కొరియా రెండు దేశాలు రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాల వీసాలు కలిగి ఉన్న వ్యక్తి వీసా లేకుండా 188 దేశాలకు వెళ్లవచ్చు. అలాగే అనేక యూరోపియన్ దేశాలు మూడవ, నాల్గవ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గత రెండు దశాబ్దాలలో 57 స్థానాలు ఎగబాకి టాప్ 5లో నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఏ స్థానంలో నిలిచిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Shocking incident: పసికందును బావిలో పడేసిన కోతి.. అద్భుతం చేసిన ‘‘డైపర్’’..

ఈ జాబితాలో భారతదేశం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 2026లో భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భారత్ ఐదు స్థానాలు ఎగబాకింది. 2025లో భారతదేశం ఈ జాబితాలో 85వ స్థానంలో ఉంది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు 55 దేశాలకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ యాక్సెస్‌ను కలిగి ఉన్నారు. ఈ మెరుగుదల చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఇది సానుకూల సంకేతంగా పరిగణించబడుతోంది.

తాజాగా రిలీజ్ అయిన జాబితాలో అమెరికా టాప్ 10కి తిరిగి వచ్చింది. ఈ దేశ వీసా కలిగి ఉన్న వాళ్లు 179 దేశాలకు వీసా-రహిత యాక్సెస్‌తో కలిగి ఉన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలోనే బలహీనమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ దాదాపు అట్టడుగు స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తికి కేవలం 24 దేశాలకు మాత్రమే వీసా-రహిత ప్రయాణం సాధ్యమవుతుంది. దాని తర్వాత సిరియా (100వ స్థానం), ఇరాక్ (99వ స్థానం), పాకిస్థాన్ (98వ స్థానం), యెమెన్, సోమాలియా వంటి దేశాలు ఉన్నాయి. నేడు బలమైన, బలహీనమైన పాస్‌పోర్ట్‌ల మధ్య అంతరం 168 దేశాలు అని ఈ జాబితా పేర్కొంది. 2006లో ఈ అంతరం కేవలం 118 దేశాలు మాత్రమే.

పాకిస్థాన్‌కు గుడ్ న్యూస్..
ఈ జాబితాలో పాకిస్థాన్ 98వ స్థానంలో నిలిచి టాప్ 100లో చోటు దక్కించుకోగలిగింది. గత సంవత్సరం 103వ స్థానంలో ఉన్న పాకిస్థాన్.. 10 ఏళ్ల తర్వాత టాప్ 100లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. అయితే ర్యాంకింగ్‌లో మెరుగుదల ఉన్నప్పటికీ, ఇప్పటికీ పాకిస్థానీయులు వీసా లేకుండా కేవలం 31 దేశాలను మాత్రమే సందర్శించవచ్చు.

READ ALSO: Adani Group: అదానీ సామ్రాజ్యానికి అమెరికా సెగ.. ఒక్కరోజే రూ.1.4 లక్షల కోట్లు ఆవిరి!

Exit mobile version