Pakistan – China: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్థాన్, చైనాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు దేశాలు కూడా భంగపాటుకు గురి అయ్యాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని ఆత్మాహుతి దళం, మజీద్ బ్రిగేడ్‌ను UN 1267 ఆంక్షల జాబితాలో చేర్చాలని పాక్, చైనాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ప్రతిపాదించాయి. అయితే ఈ ప్రతిపాదనను US, UK, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. ఈ దేశాలు BLA, మజీద్ బ్రిగేడ్‌లను అల్-ఖైదా లేదా ISILతో చేర్చడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నాయి. దీంతో పాక్, చైనాల ఉమ్మడి తీర్మానం ఆమోదం పొందడంలో విఫలమైంది.
READ ALSO: హైదరాబాద్‌లో ఐఫోన్ 17 సిరీస్ విడుదల – భారీ డిమాండ్, ఔట్‌లెట్ల ముందు లైన్ కట్టిన యువత.
ఏంటీ UN 1267 తీర్మానం..
ఈ UNSC నిబంధన 1999లో ప్రవేశపెట్టారు. దీని కింద అల్-ఖైదా, తాలిబాన్, ISILతో సంబంధం ఉన్న సంస్థలు లేదా వ్యక్తులు ప్రయాణ నిషేధాలు, ఆస్తులు, ఆయుధ ఆంక్షలను ఎదుర్కొంటారు. తాజాగా జరిగిన సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్, ISIL-K, అల్-ఖైదా, తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), BLA, మజీద్ బ్రిగేడ్ వంటి అనేక ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం పాకిస్థాన్‌కు అతిపెద్ద జాతీయ భద్రతా సవాలు అని, ఈ ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్ నిర్వహించడానికి ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం కూడా సహకరించాలని ఈ సందర్భంగా పాక్ విజ్ఞప్తి చేసింది.
పాక్‌కు షాక్ ఇచ్చిన అమెరికా..
తాజాగా జరిగిన సంఘటన ఒక రకంగా పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితిలో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఎందుకంటే గత నెలలో అమెరికా BLA, మజీద్ బ్రిగేడ్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలు (FTOలు)గా పేర్కొంది. 2019లో BLAను అమెరికా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT) గా జాబితాలో చేర్చింది. బలూచిస్థాన్‌లో ఉన్న ఈ తిరుగుబాటు సంస్థ అనేక దాడులు, ఆత్మాహుతి బాంబు దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జరిగిన సమావేశంలో మాత్రం యూఎస్ పాక్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిలిచింది.
బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలో గురువారం ఒక పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై పేలుడు పరికరంతో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు నుంచి నలుగురు పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని, ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. అయితే దాడిలో మరణించిన వారి సంఖ్య ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
READ ALSO: Telangana Assembly : పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ డిస్ క్వాలిఫికేషన్ నోటీసులు!
