పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగాయో.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ తెలిసిందే. రక్తపాతం మధ్య ఎన్నికలు.. ఇంకోవైపు టెస్ట్ మ్యాచ్‌లా ఫలితాలు రావడం ప్రపంచమంతా చూసింది. ఆ తర్వాతైనా ఫలితాలు చక్కగా వచ్చాయంటే అది కూడా లేదు. ఏ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. ఇప్పటికే పాక్‌లో ప్రభుత్వం ఏర్పడ లేదు. తాజాగా సైన్యం జోక్యంతో PML-N మరియు PPP కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి షెహబాజ్ షరీఫ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్వరలోనే షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది(Pak Supreme Court). న్యాయవ్యవస్థ ప్రత్యక్ష పర్యవేక్షణలో 30 రోజుల్లో కొత్త ఎన్నికలను ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఓట్ల తారుమారు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కానీ ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.
ఇకపోతే ఫలితాలు వచ్చిన రెండు వారాల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు చేపట్టనున్నారు.
మంగళవారం అర్థరాత్రి పీపీపీ, పీఎంఎల్‌ఎన్ నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఆ సమావేశంలో పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా, ఆసిఫ్ జర్దారీ అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించారు. పీపీపీ, పీఎంఎల్-ఎన్‌లు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను సాధించాయని.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఫిబ్రవరి 8న పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పీఎంఎల్-ఎన్ పార్టీ 75 స్థానాలను గెలుచుకోగా.. పీపీపీ 54 స్థానాలను కైవసం చేసుకుంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు 93 స్థానాల్లో విజయం సాధించారు. పీపీపీ, పీఎంఎల్‌ఎన్‌లకు 17 సీట్లు గెలిచిన ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ పార్టీ మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. దాంతో ఈ కూటమి సీట్ల సంఖ్య 146కి చేరింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 265 స్థానాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 133 ఉంటే సరిపోతుంది.
Pak Pm
