NTV Telugu Site icon

Off The Record: బీఆర్‌ఎస్ అధిష్టానం తమిళనాడు వైపు చూస్తోందా..? అదొక్కటే మార్గమని పెద్దలు భావిస్తున్నారా..?

Otr Brs

Otr Brs

Off The Record: గులాబీ తెగులుకు సన్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలనుకుంటున్నారా? మళ్ళీ వికసించి పాత పరిమళాలు గుభాళించాలంటే…. ఉదయించే సూర్యుడే దిక్కని భావిస్తున్నారా? అందుకే బీఆర్‌ఎస్‌ అధిష్టానం తమిళనాడు వైపు చూస్తోందా? కేడర్‌కు బూస్ట్‌ ఇవ్వడానికి, కారుకు సిక్స్‌త్‌ గేరేయడానికి అదొక్కటే మార్గమని బీఆర్‌ఎస్ పెద్దలు భావిస్తున్నారా? తెలంగాణ భవన్‌ వర్గాలు అసలెందుకు అన్నా అరివాలయం వైపు చూస్తున్నాయి? అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం, పార్టీ చరిత్రలో తొలిసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం, అసలు అధినేత ముందు చెప్పిన ప్లాన్స్‌ అన్నీ తల్లకిందులవడంతో బీఆర్‌ఎస్‌లో అంతర్మథనం తీవ్రంగానే ఉందట. అన్నిటికీ మించి ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల వలసలతో కేడర్‌లో నైతిక స్థైర్యం దెబ్బతిందని గ్రహించిన అధిష్టానం…దాన్ని పునరుద్ధరించడానికి చేయాల్సిన పనులు చేస్తూనే…. అంతకు మించిన కార్యాచరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పదేళ్ళపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ అంతకు ముందు ఉద్యమ పార్టీగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగా ఊపిరి పోసుకుని ఆ టార్గెట్‌ చేరుకోవడంలో సక్సెస్‌ అయినా…, పార్టీ పెట్టి పాతికేళ్ళు కావస్తున్నా… ఇంతవరకు సంస్థాగత నిర్మాణం సరిగా జరగలేదని, ఆ లోటు ఇప్పుడు తెలిసి వస్తోందన్న చర్చ జరుగుతోందట అంతర్గతంగా. ఉద్యమంలో ఉన్నప్పుడు, పవర్‌ వచ్చాక ఆ లోటు తెలియకున్నా… ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోందట. అందుకే సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్న డీఎంకే లాంటి పార్టీల నిర్వహణపై దృష్టి సారించారట బీఆర్‌ఎస్‌ పెద్దలు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ డీఎంకే. సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ… పడ్డ ప్రతిసారి రెట్టింపు వేగంతో పైకి లేచింది డీఎంకే.

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 1991లో కేవలం 2 సీట్లలోనే గెలిచింది డీఎంకే. ఇక 1984, 2011లో 25లోపు అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయింది. అయినా తిరిగి నిలదొక్కుకుని సత్తా చాటింది. ప్రస్తుతం స్టానిన్‌ సారధ్యంలో అధికారంలో ఉంది. అందుకే డీఎంకే సక్సెస్‌ ఫార్ములాతో గులాబీకి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలనుకుంటున్నారట కేసీఆర్‌. డీఎంకేకు, బీఆర్‌ఎస్‌కు పోలికలు ఉన్నాయంటూ ఆ పార్టీ తరహా అంతర్గ నిర్మాణం చేపడతామని గతంలో అన్నారు కేసీఆర్‌. కానీ… పదేళ్ళ అధికార కాలంలో ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి… సంస్థాగత వ్యవహారాలపై గట్టిగా దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ బృందం ఒకటి ఇటీవల తమిళనాడులో పర్యటించి వచ్చింది. చెన్నెలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంతో పాటు పలు జిల్లాల ఆఫీస్‌లకు వెళ్ళి నాయకులతో సమావేశమై వచ్చారట. ఆఫీస్‌ల నిర్వహణ, పార్టీ కమిటీలు,అనుబంధ కమిటీలు, పార్టీ సభ్యత్వ నమోదు తీరు, సభలు, సమావేశాల నిర్వహణతో సహా క్షేత్ర స్థాయిలో డీఎంకే యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తోందో అడిగి తెలుసుకున్నారట బీఆర్‌ఎస్‌ నేతలు.

డీఎంకేకు తమిళనాడులోని ప్రతి జిల్లా,నియోజకవర్గ కేంద్రాల్లో ఆఫీస్‌లు ఉన్నాయి. ప్రతి మూడు నెలలకు ఒక సారి పార్టీ చీఫ్ స్టాలిన్ పార్టీ పని తీరుపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తారు. అలాగే అనుబంధ సంఘాలు పార్టీ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా ఉంటాయి. విద్యార్థి,యువజన,మహిళా,కార్మిక,న్యాయ,వాణిజ్య,లాంటి 23 అనుబంధ సంఘాలు క్రియాశీలకంగా పని చేస్తాయి. అలాగే… బలమైన పొలిటికల్ రీసర్చ్‌ వింగ్‌ కూడా డీఎంకే సొంతం. ఆ విభాగం ఎప్పటికప్పుడు దేశంలోని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నరాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ… పార్టీ అధినేతకు నివేదిక ఇస్తుంది. దాని ప్రకారం పార్టీ పాలసీల్లో మార్పులు చేర్పులు కూడా ఉంటాయట. అలాగే ఎమ్మెల్యే కన్నా పార్టీ నియమించిన సమన్వయకర్త సిఫారసులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా… రకరకాల కోణాల్లో డీఎంకే పాలసీలను అధ్యయనం చేసి… వాటిని తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని అడుగు ముందుకేయాలని అనుకుంటోందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. తాము తిరిగి పుంజుకోవడానికి డీఎంకే ఫార్ములా వర్కౌట్‌ అవుతుందని నమ్ముతున్న బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

 

 

Show comments