Off The Record: ఏలూరు టీడీపీ మీద ఎంపీ పుట్టా ఎఫెక్ట్?

  • ఏలూరు టీడీపీ మీద ఎంపీ పుట్టా ఎఫెక్ట్‌?..
  • డ్రగ్స్‌ కేసు ప్రభావం పడకుండా ఎమ్మెల్యేల జాగ్రత్తలు..
  • ఎక్కువ చేస్తే మనకే ఇబ్బందులంటూ కామెంట్స్‌..
  • ఏలూరులో కనీసం పాతికేళ్ళు ఉండేలా పుట్టా మహేష్‌ ప్లాన్స్‌..
  • నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణం ప్రారంభం..
  • ఎంపీ స్థానిక నేతల్ని ఎక్కువగా కలవరని విమర్శలు..
  • ఇందుకోసమే దూరంగా ఉంటారా అంటూ ఇప్పుడు చర్చలు..
  • మేమే గెలిపించామని చెప్పిన వాళ్ళు సైతం ఇప్పుడు తూచ్‌..
  • ఎంపీ తిరిగి వచ్చినా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం?..
  • కావాలంటే ఆయన ఇంకో చోటికి వెళ్తారు, మనం వెళ్ళలేమన్న టాక్‌..
  • ఎంపీ ఎఫెక్ట్‌ పడకుండా ఏలూరు నేతల ముందు జాగ్రత్తలు..
Otr Putta Mahesh Controvers

Otr Putta Mahesh Controvers

Off The Record: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు ఏలూరు లోక్‌సభ సీటు పరిధిలో టీడీపీని బాగానే షేక్‌ చేస్తున్నాయట. లోకల్‌ ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ ఈ కేసులో ఇరుక్కోవడంతో…నియోజకవర్గంలో టీడీపీకి, వోవరాల్‌గా కూటమికి కూడా డ్యామేజ్‌ జరుగుతోందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఆయన వెనక మేమున్నామంటూ నిన్నటిదాకా డప్పుకొట్టిన వాళ్ళు కూడా….మెల్లిగా చాప చుట్టేస్తున్నట్టు సమాచారం. ఛోటామోటా నేతల సంగతి పక్కన పెడితే….ఏలూరు ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా మనకెందుకొచ్చిన గొడవ, ఆ మరకల మనకెందుకు అంటూ లైట్ తీసుకున్నారట. ఆయన ఎలా వచ్చారో…. అలాగే వెళ్తారులే…. మధ్యలో మనం కెలుక్కుంటే ఇబ్బందులు తప్పవంటూ ఒకరిద్దరు శాసనసభ్యులు డైరెక్ట్‌గానే కామెంట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే… అన్నా, ఆ సంగతేంటని అనుచరవర్గాలు అడుగుతున్నా మనకెందుకొచ్చిన తంటాల్రా బాబూ….. మన నియోజకవర్గంలో ఆ ప్రభావం పడకుండా చూసుకోవడం ఇప్పుడు ముఖ్యమని అంటున్నారట.

2024 ఎన్నికలకు ముందు ఊహించని విధంగా పుట్టా మహేష్‌కు ఏలూరు పార్లమెంటు సీటు దక్కడం, అప్పటికే అక్కడ కూటమి బలంగా ఉండడంతో గెలుపు తేలికైందని కూటమిలో ఇప్పటికీ చర్చ జరుగుతూ ఉంటుంది. అలా గెలిచిన మహేష్‌… కనీసం ఓ పాతికేళ్ళపాటు ఏలూరు పార్లమెంటులోనే పాతుకుపోవాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉన్న సీనియర్‌ని ఎలాగూ పక్కన పెట్టారు, మనకి ఇక మనకు ఢోకా లేదని సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అందుకు తగ్గట్టే… పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తన మార్క్ వేయడంలో భాగంగా ఇక్కడ సొంత ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. కానీ…. అంత భారీ టార్గెట్‌ పెట్టుకున్నా… రెండేళ్లు గడవక ముందే డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఎంపీ గ్రాఫ్ నేల చూపులు చూసేలా చేసింది. ఐతే MPని కలవాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ఆయన అనుచగణాన్ని దాటడం అంత ఈజీ కాదన్న విమర్శలున్నాయి. అలా ఎంతో కొంత అసంతృప్తికి గురైన వాళ్ళంతా ఇప్పుడు నోరు విప్పుతున్నారట. ఎవర్నీ దగ్గరకు రానివ్వకుండా ఇన్నాళ్ళు ఆయన అంత గుట్టుగా ఉండడానికి కారణం ఇదేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నవాళ్ళు కూడా పెరిగిపోతున్నారు.

ఆ విషయం అలా ఉంచితే… ఎంపీని తామే గెలిపించామని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన నేతల్లో చాలామంది ఇప్పుడు అబ్బే…. మాకేం సంబంధం లేదు. అంతా అధిష్టానమే చూస్తుందంటూ ప్లేట్ ఫిరాయిస్తున్నారట. ఏలూరు ఎంపీ సీటు పరిధిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తొలిసారి చట్టసభలో అడుగుపెట్టిన వారే. ఇందులో ఒకరిద్దరిపై ఇప్పటికే ఆరోపణలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఎంపీ దెబ్బకు బటర్‌ఫ్లయ్‌ ఎఫెక్ట్ తమ మీద పడితే అసలుకే ఎసరు వస్తుందని భయపడుతున్నన్నట్టు తెలిసింది. ఒకవేళ డ్రగ్స్ కేసు సద్దుమణిగినా… తర్వాత జరిగే ప్రచారం ఎఫెక్ట్ మనపై పడకుండా చూసుకోవాలని ఏలూరు జిల్లాలో మెజారిటీ నాయకులు భావిస్తున్నారట. ఇప్పటికైతే ఎంపీ పుట్టా మహేష్ అధికారికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి ఇబ్బందిలేదని, రేపు ఆయన తిరిగొచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలని లోకల్ లీడర్లు చర్చించుకుంటున్నట్టు సమాచారం. కడప నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కాకుంటే ఇంకో చోటికి వెళ్తారు. ఆయన వల్ల మనకు డామేజ్ జరిగితే మనం ఎక్కడికీ వెళ్ళలేమన్నది వాళ్ళ అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఎంపీ ఎఫెక్ట్‌ తమ మీద పడకుండా ఏలూరు జిల్లా టీడీపీ నాయకులు చాలా ముందు జాగ్రత్తలే తీసుకుంటున్నారన్నది లోకల్‌ టాక్‌. స్థానిక పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్న ఎమ్మెల్యేలు రేపు లోకల్‌బాడీస్ ఎలక్షన్స్‌లో పరిస్థితి చే జారకుండా చూసుకునే పనిలో బిజీగా ఉన్నారట.