Off The Record: ఆలూరు టీడీపీ నేతలకు చంద్రబాబు స్పెషల్ టాస్క్

  • ఆలూరు టీడీపీ నాయకులకు చంద్రబాబు సీరియస్‌ క్లాస్‌..
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని టార్గెట్‌..
  • ఆవిర్భావం నుంచి రెండు సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలుపు..
  • గ్రూప్‌ వార్‌తో తీవ్రంగా నష్టపోతున్న పార్టీ..
  • ఆలూరు టీడీపీ నేతలపై తీవ్ర స్థాయి అవినీతి ఆరోపణలు..
  • గ్రూప్స్‌ గోలవల్లే కూటమి వేవ్‌లోనూ ఆలూరులో ఓటమి?..
  • అభివృద్ధిలోనూ స్టేట్‌ యావరేజ్‌కంటే బాగా వెనుకబాటు..
  • స్థానిక ఎన్నికల ఫలితాలే గీటురాయిగా పార్టీ నేతలకు గైడ్‌లైన్స్‌..
Otr Alur Tdp

Otr Alur Tdp

Off The Record: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం టీడీపీ నేతల తీరును పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారట. కార్యకర్తల సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసిన బాబు… కొందరి తీరును తప్పు పట్టడంతోపాటు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు. గ్రూపుల కారణంగా తీవ్ర నష్టం జరుగుతోందని, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చి తీరాల్సిందేనని టార్గెట్ పెట్టారట. కలిసికట్టుగా పనిచేయాలని, వర్గాలు సృష్టించవద్దని స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారన్నది ఇంచర్నల్‌ వాయిస్‌. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆలూరు నియోజకవర్గంలో రెండే రెండు సార్లు గెలిచింది. ఈ పరిస్థితి మారాలంటూ లోకల్‌ లీడర్స్‌కు ఒకింత సీరియస్‌గానే చెప్పినట్టు సమాచారం. వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్‌కు, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ వైకుంఠం జ్యోతి వర్గానికి అస్సలు పడకపోవడాన్ని గుర్తించిన చంద్రబాబు… కప్పట్రాల బొజ్జమ్మకు క్లాస్ తీసుకున్నారట. నియోజకవర్గ బాధ్యతల్ని పార్టీ ఎవరికి అప్పగిస్తే వారి ఆధ్వర్యంలోనే అంతా కలిసికట్టుగా అందరూ పనిచేయాలని చెప్పారట సీఎం. విబేధాలు సృష్టించే వాళ్ళమీద పడుతుందని కూడా మొహమాటం లేకుండా చెప్పినట్టు తెలిసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని సూచించడంతో పాటు… ఇన్ఛార్జ్‌ వైకుంఠం జ్యోతి అనుచరుల తీరును తప్పుపట్టినట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మీద అవినీతి ఆరోపణలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. అటవీ భూముల ఆక్రమణ, అంగన్వాడీ టీచర్‌కు లైంగిక వేధింపులు, అడిగినంత ఇవ్వలేదన్న కసితో రియలెస్టేట్‌ వెంచర్‌ను ట్రాక్టర్ తో దున్నించడం వంటి సంఘటనలు పార్టని డ్యామేజ్‌ చేస్తున్నాయంటున్నారు కార్యకర్తలు. ఇక స్వయంగా చంద్రబాబు నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి మాజీ ఇంచార్జి, రెండు సార్లు పోటీ చేసి ఓడిన వీరభద్ర గౌడ్ గైర్హాజరయ్యారు. పార్టీలో విబేధాల కారణంగానే ఆయన డుమ్మా కొట్టినట్టు తెలిసింది. అటు మీటింగ్‌కు ఆహ్వానం లేదన్నది వీరభద్ర గౌడ్ వర్గీయుల వాదన. గత కొన్నేళ్లుగా ఆలూరు టీడీపీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో కూటమి వేవ్‌లోనూ వీరభద్ర గౌడ్ ఓడిపోవడానికి ఈ గ్రూపుల గోలే కారణమన్న విశ్లేషణలున్నాయి. అదే సమయంలో వీరభద్ర గౌడ్ ఒంటెత్తు పోకడ కూడా ఓటమికి ప్రధాన కారణం అని ఇప్పటికీ పార్టీలో మాట్లాడుకుంటారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి బాగా పట్టున్నా…. నేతల్లో అనైక్యత బాగా నష్టం చేస్తోందని అంటున్నారు. అటు అభివృద్ధి అంశాల్లోనూ ఈ నియోజకవర్గం బాగా వెనుకబడి ఉంది.

రెండు, మూడు సబ్జెక్ట్‌లు మినహాయిస్తే… ప్రతి విషయంలోనూ…. రాష్ట్ర యావరేజ్ కంటే బాగా వెనుకబడ్డట్టు చంద్రబాబు రివ్యూలో తేలిందట. తాగునీటి సమస్య గురించి అడిగినప్పుడు మీటింగ్‌లోని ఒక్కరు కూడా స్పందించలేదంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో సీఎంకు అర్థమై పోయిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. అలాగే…. అఫీషియల్‌ రివ్యూలో కూడా అధికారులకు గట్టిగా క్లాస్‌ పీకారట సీఎం. బహుశా రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు చేస్తున్న పర్యటనల్లో ఇప్పటి వరకు నిర్వహించిన సమీక్షలో ఏ నియోజకవర్గంలోనూ లేనంత వెనుకబాటుతనం ఆలూరులో కనిపించిందని అంటున్నారు. దీంతో… ఇక్కడ పార్టీ తీరు, అభివృద్ధి రెండిటినీ ఏక కాలంలో సెట్‌ చేయాలని నిర్ణయించారట సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే గీటురాయిగా పార్టీ నేతలకు గైడ్‌లైన్స్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఆలూరు నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉండడ వల్ల ఇక్కడ అధికారుల పర్యటనలు కూడా అంతంత మాత్రమే. దాంతో ఆఫీసర్స్‌ మీద కూడా సీరియస్‌ అయ్యారట బాబు. ఇప్పటికైనా మేల్కొని… స్థానిక సంస్థల ఎన్నికల నాటికి లోకల్‌ టీడీపీ నేతలు ఐక్యతారాగం వినిపిస్తారా…అధికారుల తీరు కూడా మారుతుందా అన్నది చూడాలి.