October 1 Rule Changes India: అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశంలో అనేక ఆర్థిక, ఆర్థికేతర రంగాల్లో పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. వీటిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) నుంచి మొదలుకొని రైల్వే టికెట్ బుకింగ్ వరకు మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో మీకు తెలుసా?..
READ ALSO: Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 ఎర్లీ ప్రీమియర్స్ క్యాన్సిల్..
మార్పులు ఏమిటంటే..
NPCI లో పుల్ లావాదేవీలు నిలిపివేత: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, PhonePe, Google Pay, Paytm వంటి UPI ప్లాట్‌ఫామ్‌లలో పర్సన్-టు-పర్సన్ (P2P) “కలెక్ట్ రిక్వెస్ట్” లేదా “పుల్ ట్రాన్సాక్షన్” ఫీచర్‌ను నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. దీని అర్థం మీరు ఇకపై ఎవరి నుంచి డబ్బును అభ్యర్థించలేరు. ఈ నిర్ణయం వినియోగదారుల భద్రతను మెరుగుపరచడం, అలాగే ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం లక్ష్యంగా తీసుకుందని ఎన్‌పీసీఐ తెలిపింది.
ఈక్విటీ-లింక్డ్ స్కీమ్‌లలో 100% పెట్టుబడి: ప్రభుత్వేతర చందాదారులు ఇప్పుడు వారి పెన్షన్ సంపదలో 100% వరకు మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) కింద ఈక్విటీ-లింక్డ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టగలరు. గతంలో ఈ పరిమితి కేలవం 75% వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదనంగా PRAN (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య) తెరవడానికి, ఖాతాను నిర్వహించడానికి రుసుములు కూడా సవరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, e-PRAN కిట్ ధర రూ.18, భౌతిక PRAN కార్డు ధర రూ.40 గా నిర్ణయించారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ NPS చందాదారులకు రుసుములు మారుతూ ఉంటాయి.
ఇకపై ఆధార్-ధృవీకరించిన వాళ్లకు మాత్రమే రిజర్వ్ వెసులుబాటు: అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ రిజర్వేషన్ విండో తెరిచిన తర్వాత మొదటి 15 నిమిషాల పాటు ఆధార్-ధృవీకరించిన వినియోగదారులు మాత్రమే రిజర్వ్ చేసిన టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. టిక్కెట్ల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ నియమం తీసుకున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది.
మారనున్న ఆన్‌లైన్ గేమింగ్ నిబంధనలు: పారదర్శకతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ నిబంధనలు మారనున్నాయి. ఇందులో వయో పరిమితులు, లైసెన్సింగ్ అవసరాలకు సంబంధించిన నియమాలు కూడా ఉండనున్నాయి.
ఖరీదుగా మారనున్న PNBలో లాకర్ కీపింగ్: అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో లాకర్, ఇతర సేవలకు రుసుములను పెరగనున్నాయి. దీని వలన బ్యాంకులో లాకర్ కీపింగ్, ఖరీదైనదిగా మారుతుంది. నమోదు రుసుములు కూడా పెరుగుతాయని తాజా సమాచారం.
స్పీడ్ పోస్ట్‌కు పెరిగిన ఖర్చు: అక్టోబర్ 1 నుంచి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా స్పీడ్ పోస్ట్ పంపడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ సేవ కోసం పోస్టల్ డిపార్ట్‌మెంట్ రుసుమును పెంచుతోంది. అదనంగా స్పీడ్ పోస్ట్ OTP- ఆధారిత డెలివరీ సిస్టమ్‌తో అనుసంధానించనున్నారు. దీని అర్థం ఇకపై గ్రహీత ధృవీకరించిన తర్వాత మాత్రమే స్పీడ్ పోస్ట్ డెలివరీ చేయగలరు.
RBIలో కొత్త చెక్ క్లియరెన్స్ సౌకర్యం: వేగవంతమైన చెల్లింపుల దిశగా ఒక ప్రధాన అడుగులో RBI అక్టోబర్ 4 నుంచి నిరంతర చెక్ క్లియరింగ్ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. పలు నివేదికల ప్రకారం.. ఈ సౌకర్యం రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి జనవరి 2, 2026 వరకు కొనసాగుతుంది. రెండవ దశ జనవరి 3, 2026న ప్రారంభం కానుంది.
21 రోజులు బ్యాంకులు బంద్: దసరా, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగలతో సహా అక్టోబర్‌లో 21 రోజులు బ్యాంకులు మూసి వేయనున్నారు. అయితే ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉండనున్నాయి. అందువల్ల ప్రజలు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను బ్యాంకు సెలవులను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలని అధికారులు, సిబ్బంది సూచించారు.
