NTV Telugu Site icon

Top Headlines@ 9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines@9am

Top Headlines@9am

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు:
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ (ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. జనవరి 1న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు (పీఎన్‌ఆర్‌ మార్గ్‌), అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని పేర్కొన్నారు.

నేడు ఒంటిగంట వరకు మెట్రో సేవలు:
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. పార్టీలు, దావత్‌ల కోసం యువత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో, విద్యార్థులు, ఉద్యోగులు ఒక రేంజ్‌లో ఆనందించాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం రకరకాల ప్రణాళికలు రూపొందించారు. స్నేహితులంతా కలిసి అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేసి.. 12 గంటలకు కేక్ కట్ చేసి, కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని చాలా మంది అనుకుంటారు. అయితే అర్ధరాత్రి వరకు తిరిగి తమ గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్ లో మెట్రో నిర్వహణ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 (ఆదివారం) అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని ప్రకటించారు. చివరి రైలు సంబంధిత స్టేషన్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 1 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని పేర్కొంది.

భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం:
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున హ్యాండ్‌ గ్లవ్స్‌ తయారీ కంపెనీలో చెలరేగిన మంటల్లో ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఔరంగాబాద్‌ సమీపంలోని వలుజ్‌ ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కస్టపడి.. ఆదివారం ఉదయం వరకు మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ అగ్ని ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం:
ఢిల్లీ ప్రజలు విషపూరితమైన గాలిని పీల్చుకోవాల్సి వస్తోంది. గాలి నాణ్యత మెరుగుపడలేదు. శనివారం మరోసారి AQI 400కి చేరుకుంది. పెరుగుతున్న చలితో, ఉష్ణోగ్రతలో నిరంతర క్షీణత కనిపిస్తుంది. దట్టమైన పొగమంచు కూడా చుట్టూ వ్యాపించే అవకాశం ఉంది. AQI పెరుగుతుందని అంచనా వేయడానికి ఇదే కారణం. పైగా, న్యూ ఇయర్ వేడుకల్లో బాణసంచా కాల్చడం కూడా నగరవాసుల ఉత్సాహాన్ని పాడుచేస్తుంది. మరో మూడు రోజుల పాటు ప్రమాదకర పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు క్రాకర్లు పేల్చితే గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉంది.

రాజధానిలో డేగ కళ్లతో నిఘా:
నూతన సంవత్సర వేడుకలకు ముందు ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న సరిహద్దులు, ప్రాంతాల్లో భద్రతను పెంచారు. వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు 10,000 మందికి పైగా పోలీసులను మోహరించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా పారామిలటరీ బలగాలను మోహరించడంతో పాటు అదనపు పికెట్లు, బారికేడ్లు, పోలీసు సిబ్బందిని మోహరించారు. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా విధించే చట్టపరమైన నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు.

ఇండోనేషియాలో బలమైన భూకంపం:
ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10.46 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం 77 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రస్తుతం ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇండోనేషియా వాతావరణ విభాగం సునామీ ప్రమాదమేమీ లేదని, అయితే మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. కొన్ని చోట్ల భూకంప తీవ్రత 6.3, 6.5గా నమోదైంది.

బంగారం ప్రియులకు ఊరట:
బంగారం ప్రియులకు శుభవార్త. పసిడి కొనుగోలు చేయాలనుకుని.. ధరల పెరుగుదలతో వెనకడుగు వేస్తున్న వారికి ఇదే మంచి సమయం. 10 రోజుల తర్వాత బంగారం ధరలు శనివారం దిగివచ్చాయి. ఆదివారం బంగారం ధర స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్లో నేడు (డిసెంబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,870గా ఉంది. ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం పెరిగింది. ఆదివారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండిపై రూ. 300 పెరిగి.. రూ. 78,600లుగా ఉంది.

Show comments