Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సజీవదహనం
తిరుపతి చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి కారుపై పెట్రోల్ పోసి కారులో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజును దుండగులు తగలబెట్టారు. తిరుపతి నుంచి స్వగ్రామం బ్రాహ్మణపల్లికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారుకు నిప్పు పెట్టడంతో కాసేపట్లోనే ఆ మంటల్లో నాగరాజు సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకుని కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభ్యమైన గోల్డ్ చైన్, చెప్పులు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే నాగరాజు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నాగరాజు మృతితో కుటంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో విచారణ వేగవంతమైంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 

*బెజవాడలో మరోసారి ఎండీఎంఏ డ్రగ్స్ కలకలం

బెజవాడలో మరోసారి ఎండీఎంఏ డ్రగ్స్ కలకలం సృష్టించాయి.బెంగుళూరు నుంచి బెజవాడ వచ్చిన కిలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ అనంతపురం డిపో బస్ ద్వారా డ్రగ్స్ బస్టాండ్ చేరుకున్నట్లు గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ వైవీఎస్‌ రావుకి స్కూల్ బ్యాగ్ ఇచ్చి బెజవాడలో అందజేయాలని ఓ ఆగంతకుడు ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. బస్సు విజయవాడ చేరుకున్న తర్వాత అర్ధరాత్రి డ్రైవర్‌ వైవీఎస్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న బట్టల్లో ఓ ప్యాంటు నడుము చుట్టూ ఉన్న ఓ అంగుళం మందం పట్టీలో నిందితులు డ్రగ్స్‌ను పెట్టి కుట్టేశారు. ప్యాంట్‌లో కుట్టిన భాగాన్ని చించి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ వైవీఎస్ రావును పోలీసులు విచారించారు

 

*రాత్రి వేళల్లో వీధికుక్కల సంచారం.. బరిలో ప్రత్యేక టీం

హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సూచించిన సూచనల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 26 అంశాలతో కూడిన నివేదికను మేయర్ విజయలక్ష్మికి అందజేశారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పలు సమస్యలను కమిటీ సభ్యులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. కుక్కకాటు నివారణకు వెటర్నరీ, శానిటేషన్, హెల్త్ విభాగాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు మేయర్‌కు సూచించారు. ప్రస్తుతం రోజుకు 300 నుంచి 400 మందికి స్టెరిలైజేషన్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలని, కుక్కలను పట్టుకునేందుకు రాత్రి వేళల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు పని చేయాలన్నారు. పశువైద్య శాఖ సేవలను వార్డుల వారీగా అమలు చేసేందుకు వార్డుకు ఇద్దరు చొప్పున ఔట్ సోర్సింగ్ విధానంలో రెండేళ్లపాటు వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలన్నారు.

 

* స్వలింగ పెళ్లిళ్లు భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం

స్వలింగ వివాహాలను గుర్తించబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే దేశంలోని పలు మైనారిటీ మత సంస్థలు అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా జమియత్ ఉలమా-ఐ-హింద్ స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించవద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భారతదేశంలో స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపుకు సంబంధించిన విషయంలో జమియత్ ఉలమా-ఐ-హింద్ జోక్యం కోరింది. స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకించింది. స్వలింగ సమ్మతం కాదనీ.. ఇది కుటుంబ వ్యవస్థపై దాడి, వ్యక్తిగత చట్టాలన్నింటినీ పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంటూ ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న అనేక పిటిషన్లపై జోక్యం చేసుకోవాలని కోరుతూ. హిందువుల మధ్య వివాహం యొక్క ఉద్దేశ్యం కేవలం శారీరక ఆనందం లేదా సంతానం కాదు, ఆధ్యాత్మిక పురోగతి అని చెప్పడానికి సంస్థ హిందూ సంప్రదాయాలను ఉదహరించింది. హిందువుల పదహారు సంస్కారాలలో వివాహం ఒకటని జమియత్ పేర్కొంది. స్వలింగ వివాహం అనే భావన ఈ ప్రక్రియ ద్వారా కుటుంబాన్ని సృష్టించే బదులు కుటుంబ వ్యవస్థపై దాడి చేస్తుందని జమియాత్ పేర్కొంది. స్వలింగ వివాహాలను చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ లను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి మార్చి 13న సుప్రీం కోర్టు రిఫర్ చేసింది. ఇది చాలా ప్రాథమిక సమస్యగా కోర్టు పేర్కొంది.

 

*అమెరికాలో టోర్నడోల బీభత్సం 

మరోసారి విధ్వంసకర తుఫానులు, అమెరికాలో విధ్వంసం సృష్టించాయి. శుక్ర, శనివారాల్లో తెల్లవారుజామున వచ్చిన భీకర టోర్నడో కారణంగా 18 మంది మరణించారు. అంతే కాదు పలువురు గాయపడ్డారు. అమెరికాలోని ఇల్లినాయిస్ లోని అర్కాన్సాస్ లో టోర్నడో బీభత్సం సృష్టించింది. దక్షిణ యూఎస్ రాష్ట్రంలో అర్కాన్సాస్ లోని అనేక ప్రాంతాల్లో ఈ సుడిగాలిలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంది. విధ్వంసకర తుఫానులు, టోర్నడోలు.. వ్యాపారులు క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు విపరీతమైన నష్టాన్ని కలిగించింది. ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అర్కాన్సాస్ గవర్నర్ శుక్రవారం మధ్యాహ్నం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలాగే మిస్సోరిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
నార్త్ లిటిల్ రాక్ లో టోర్నడోలో తుఫాన్ కారణంగా ఒక వ్యక్తి, వ్యాన్ లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. అక్కడ కనీసం 30 వరకు ఆస్పత్రి పాలయ్యారని లిటిల్ రాక్ మేయర్ ఫ్రాంక్ స్కాట్ జూనియర్ తెలిపారు. ఇదొక్కటే కాదు.. 2 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల గోడలు, పైకప్పులు కూలిపోయాయి. దీనికి తోడు గాలివాన ధాటికి ఆగి ఉన్న వాహనాలు బోల్తా పడి చెట్లు, విద్యుత్ తీగలు నేలకూలాయి.

 

*మూడేండ్ల తరువాత ఉప్పల్ లో ఐపీఎల్ సంబురం

మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ లో జరిగే తొలి మ్యాచ్ లో హైదరాబాద్ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రౌండ్ చుట్టు పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 340 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం 7 అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు. మరోవైపు నగరం నలువైపుల నుంచి వచ్చే ప్రేక్షకుల కోసం ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను గ్రేటర్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. రద్దీకనుగుణంగా ప్రతి 5,3,2 నిమిషాలకు ఒకటి చొప్పున అదనంగా మెట్రో రైళ్లను కూడా నడిపించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో బందోబస్తు ఏర్పాట్లను ఇప్పటికే రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ పర్యవేక్షించారు. ఈ మ్యాచ్ కు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం 1500 మంది పోలీస్ సిబ్బందితో భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేట్టారు. మ్యాచ్ సందర్భంగా నిర్ధేశించిన పార్కింగ్ స్థలాలు, పోలీసులు సూచించిన ప్రవేశమార్గం, బయటికి వెళ్లే మార్గాల్లోనే ప్రేక్షకులు వెళ్లాలని అధికారులు తెలిపారు. బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలను ఈవ్ టీజింగ్ నియంత్రణకు ప్రత్యేకంగా షీటీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

Exit mobile version