*కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి! కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి! అంటూ కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని రాష్ట్ర మంత్రి కేటిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలు అడ్డుకుంటున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడించారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మంత్రి మరోసారి కుండబద్దలు కొట్టారు. కేవలం కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ తన ఎజెండా అమలు కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ ను క్రమంగా చంపే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తుందన్నారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నదన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్ ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటిని పూర్తిగా ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు, ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
*హమ్మయ్య.. సెలవులు వచ్చేశాయోచ్చ్..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసే వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో జూనియర్ కాలేజీ లకు వేసవి సెలవులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మళ్లీ జూన్ ఒకటి న కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో కాలేజీ లు తెరవద్దని అధికారులు సూచించారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. సెలవుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, నవంబర్ 20 నుండి 25 వరకు హాఫ్ యర్లీ ఎగ్జామ్స్, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.. మార్చి 2024 మొదట వారంలో ఇంటర్ పరీక్షలు ఉండగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్యకు మొత్తం 227 పనిదినాలుంటాయని బోర్డు తెలిపింది.
*ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హత్య కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తమ్ముడి వివాహేతర సంబంధం కారణంగానే అన్న హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బ్రాహ్మణపల్లికి చెందిన రిప్పుంజయ, సర్పంచ్ చాణక్య, గోపిలే హత్యకు కారణమని మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారు. వారే తన అన్నను కొట్టి చంపేసి అనంతరం కారులో పెట్టి సజీవదహనం చేశారని మృతుడి తమ్ముడు పురుషుత్తం ఆరోపించాడు. తన విషయం గురించి మాట్లాడాలని వెళ్లిన తన అన్నను దారుణంగా హత్య చేశారని తెలిపాడు. వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు.. తిరుపతి నుంచి వెళ్తుండగా గంగుడుపల్లె దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిదైంది. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వస్తువులు, కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడు నాగరాజుగా గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సాయంతో విచారణ కొనసాగుతోంది. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, నాగరాజును రిప్పుంజయ, సర్పంచ్ చాణక్య, గోపీలు హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా పంచాయితీ పేరుతో నాగరాజును సర్పంచ్ తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా, నాగరాజు తమ్ముడు పురుషోత్తంకు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చాణక్య.. నాగరాజుతో మాట్లాడాలని పిలిపించాడు. ఈ క్రమంలోనే మాటల సందర్భంగా ఆగ్రహంతో సర్పంచ్ చాణిక్య.. ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సర్పంచ్ చాణిక్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరణ వార్త తెలుసుకొని వారంతా బోరునవిలపిస్తున్నారు.
*దేశంలో కరోనా విజృంభణ
భారతదేశంలో గత 24 గంటల్లో 3 వేల 823 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 27 శాతం పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ లో నిన్న 2 వేల 994 ఉండగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య 16 వేల 354 కి పెరిగాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్‌ను అందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసులు గతంలో కంటే ఇవాళ్టితో పోలిస్తే 27% పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 3,824 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిందని తెలిపింది. శుక్రవారం, దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు 3,095.. శనివారం 2995 వద్ద ఉంది. ఇంతలోనే కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపెడుతుంది. మొత్తం యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 18 వేల 389కు పెరిగింది. వైరస్ బారిన పడిన వారు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.04% (4,47,22,605). మరోవైపు, రికవరీల సంఖ్య 4,41,73,335 (98.77%)కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 5,30,881 మంది ప్రాణాలు (1.19%) కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
*మహారాష్ట్రలో మత ఘర్షణలు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. రెండు రోజుల తర్వాత జల్గావ్ లో మళ్లీ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. శనివారం విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని అతర్వాల్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో గొడవలు జరుగుతున్నాయని జల్గాన్ ఎస్పీ ఎం రాజ్ కుమార్ తెలిపారు. ఈ అల్లర్లపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నాం అని ఎస్పీ తెలిపారు. మార్చ్ 30న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నమాజ్ సందర్భంగా మసీదు వెలుపల సంగీతం వినిపించే విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి 56 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
*ప్రేమించుకోండి అంటూ స్టూడెంట్స్ కు హాలిడేస్
డ్రాగన్ కంట్రీ ఎప్పుడూ దూకుడుగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చైనాలో జననాల రేటు పడిపోవడంతో.. అది పెంచే దిశగా రకరకాల చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రజలను ప్రోత్సహంచేలా చైనా చేయని ప్రయత్నం లేదు. అందుకోసం ప్రస్తుతం ప్రేమలో పడండి అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది. ఈ మేరకు చైనాలో తొమ్మిది కళశాలల్లోని విద్యార్థులను ప్రేమలో పడండి అంటూ ఏప్రిల్ నెలలో వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం. ఫ్యానమీయి ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహిస్తున్న మిన్యాంగ్ ప్లయింగ్ వోకేషన్ లో కాలేజ్ మొదటి మార్చి 21 నుంచి వసంత విరామాన్ని ప్రకటించింది. ప్రకృతిని ఆస్వాధిస్తూ.. జీవితాన్ని ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి అని విద్యార్థులను చైనా దేశం ప్రొత్సహిస్తోంది. జననల రేటును పెంచడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం అని చెబుతుండటం విశేషం. అదీగాక జనన రేటును పెంచడానికి ప్రభుత్వానికి 20కి పైగా సిఫార్సులు వచ్చాయి. ఐతే నిఫుణులు జనాబా క్షీణతను తగ్గించే ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ.. ఇదోక ప్రయత్నంగా తెరమీదకు తీసుకుచ్చి అమలు చేస్తున్నారు. వాస్తవానికి 1980 నుంచి 2015 మధ్య విధించిన ఒక బిడ్డ విధానం చైనాను తన గుంత తనే తవ్వుకునేలా చేసింది. కరోనా మహమ్మారి తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల కారణంగా చైనాలో ఒక్కసారిగా జననాల రేటు ఘోరంగా పడిపోయింది.
*సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఇకలేరు..
సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఇవాళ కన్నుమూశారు. చెన్నైలో అనారోగ్యంతో కాస్ట్యూమ్ కృష్ణ తుది శ్వాస విడిచారు. కాస్ట్యూమ్ కృష్ణ ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట. కాస్ట్యూమ్ కృష్ణ నటుడిగా తొలి సినిమా భారత్ బంద్ సినిమాలో నటుడిగా పరిచయం అయ్యారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తాత గా తండ్రిగా అనేక పాత్రల తో మెప్పించారు. నిర్మాతగా 8 సినిమాలు నిర్మించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణ వార్త వినడానికి బాధగా ఉంది, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని దిల్ రాజు తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ నటుడు, కాస్ట్యూమ్స్ కృష్ణ అనతికాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. రామానాయుడు సంస్థలో పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. లెక్కలేనన్ని సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి కథానాయికలకు కాస్ట్యూమ్స్ అందించి సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. అంతేకాకుండా.. ఆయన ఘట్టమనేని కృష్ణ హీరోగా అశ్వద్దామ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో పెళ్లాం చెప్తే వినాలి, మా ఊరు మారాడు, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అయితే అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో జేబులో కాసుల వర్షం కురిసింది.
*నాటు నాటు సాంగ్‌కు ఆలియా భట్, రష్మిక స్టెప్పులు
ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. రెండో రోజు కూడా ఆదే స్థాయిలో పలువురు బాలీవుడ్ తారలు వేదికపై సందడి చేశారు. వారికి ఇష్టమైన పాటలకు స్టెప్పులు వేస్తూ హల్ చల్ చేశారు. వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు స్టెప్పులతో అదరగొట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. పలువురు బాలీవుడ్ తారలు సైతం వేదికపై డ్యాన్స్ చేశారు. రణవీర్ సింగ్ సైతం ప్రియాంక చోప్రాతో కలిసి స్టెప్పులేశారు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తూ జిగి హడిద్ ను చేతులపై ఎత్తుకుని సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్ లో పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, దుల్కర్ సల్మాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సైప్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
*ఉప్పల్ లో హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్.. ఫ్యాన్స్ హంగామా
ఉప్పల్ క్రికెట్ స్టేడియం మరోసారి అభిమానులతో హోరెత్తనుంది. వరుసగా మూడు సీజన్లు టీవీల్లో, ఫోన్ లలో ఐపీఎల్ మ్యాచ్ లు చూసి సంతృప్తి చెందిన క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రత్యేక్షంగా మైదానంలో ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటితో మొదలు పెట్టి మే 18వరకు ఏడు ఐపీఎల్ మ్యాచ్ లు స్టేడియంలో అలరించనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్.. ఆపై ఆదివారం వేసవి వినోదాన్ని ఆస్వాందించేందుకు ఈ కాంబినేషన్ సరిగ్గా సరిపోతుంది.
నేడు సొంత గడ్డపై సన్ రైజర్స్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే పోరులో తలపడనుంది. ఈ రోజు మాత్రమే కాదు.. వచ్చే ఆదివారం కూడా హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో వరుసగా రెండు వారాంతాలు ఫ్యాన్స్ కు పండుగే.. సీజన్ లో తొలి మ్యాచ్ కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్ కూడా ఉంది. దాంతో అవుట్ ఫీల్డ్, పిచ్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిష్టాత్మకంగా మ్యాచ్ లు జరపాలని హెచ్ సీఏ పట్టుదలగా ఉంది. ఐపీఎల్ లో వినోదం గురించి నగర అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా స్థానిక జట్టుకు పెద్ద సంఖ్యలో మద్దతు లభించడం ఖాయం. దాంతో మరోసారి మైదానం ఆరెంజ్ రంగుతో నిండిపోనుంది. ప్రస్తుతానికి ఇవాళ, వచ్చే ఆదివారం జరిగే రెండు మ్యాచ్ ల కోసమే సన్ రైజర్స్ టికెట్లను అందుబాటులో ఉంచింది. రెండు మ్యాచ్ లకు సంబంధించి తక్కువ విలువ ఉన్న టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయాయి. పేటీఎం, ఇన్ సైడర్ ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రూ. 1367 ఆపై ధర గత టికెట్లు లభిస్తున్నాయి. జింఖానా గ్రౌండ్ లో 24సెవెన్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అవుట్ లెట్ లలో కూడా నేరుగా టికెట్లు కొనుక్కునే అవకాశం ఉంది.
