NPS Tatkal Scheme: ఉద్యోగులు సరే.. ఉద్యోగాలు చేయకుండా.. చిన్నా చితక పనులు చేసుకునేవారికి వారికి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఎంతైనా అవసరం.. ఇక, పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జీవించాలంటే ఇప్పటి నుంచే పొదుపు చేయడం ఎంతో అవసరం. అయితే, రోజువారీ ఖర్చులు, పెరుగుతున్న ధరల కారణంగా తక్కువ ఆదాయం ఉన్నవారు పెద్ద మొత్తంలో పొదుపు చేయలేకపోతున్నారు. ముఖ్యంగా గిగ్ వర్కర్లు, డెలివరీ పార్ట్నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, అసంఘటిత రంగ కార్మికులకు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని ఆదా చేయడం కష్టంగా మారుతోంది. ఇలాంటి వారికి ప్రయోజనం చేకూర్చేలా జాతీయ పింఛను వ్యవస్థ (NPS)లో కొత్త డిజిటల్ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (PFRDA) సిద్ధమవుతోంది. అదే NPS తత్కాల్. ఈ విధానం ద్వారా రోజుకు కేవలం రూ.10 వంటి చిన్న మొత్తాలను కూడా యూపీఐ ద్వారా పెన్షన్ ఖాతాలో జమ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
మూడు క్లిక్‌లతోనే పెన్షన్ ఖాతా.. 10 సెకన్లలో ప్రక్రియ!
NPS ఖాతా తెరిచే ప్రక్రియను మరింత సులభతరం చేయడమే NPS తత్కాల్ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పెన్షన్ ఖాతా ప్రారంభించడానికి వ్యక్తిగత వివరాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త విధానంలో కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాలో ఇప్పటికే ఉన్న KYC (నో యువర్ కస్టమర్) వివరాలను ఉపయోగించుకోవచ్చు. దీంతో ప్రతిసారీ వ్యక్తిగత సమాచారాన్ని మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థల సహాయంతో కేవలం మూడు క్లిక్‌లలోనే ఖాతా తెరిచేలా ఈ సదుపాయాన్ని రూపొందిస్తున్నారు. మొత్తం ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ సుమారు 10 సెకన్లలో పూర్తవుతుందని PFRDA ఛైర్మన్ ఎస్. రామన్ వెల్లడించారు. అయితే ఈ సదుపాయం ప్రారంభించే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.
రోజుకు రూ.10.. గంటకోసారి కూడా జమ చేసుకోవచ్చు!
NPS తత్కాల్లో అందరినీ ఆకర్షిస్తున్న అంశం చిన్న మొత్తాలతో పొదుపు చేసుకునే వెసులుబాటు. యూపీఐ ద్వారా రోజుకు రూ.10 లేదా అవసరాన్ని బట్టి గంటవారీగా కూడా రూ.10 చొప్పున పెన్షన్ ఖాతాలో జమ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఉదాహరణకు రోజుకు రూ.10 చొప్పున పొదుపు చేస్తే నెలకు రూ.300, ఏడాదికి రూ.3,650 జమ చేయవచ్చు. ఇలా తమ ఆదాయం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న మొత్తాలతోనే పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రూ.10 అనేది ప్రతి విడతలో జమ చేయగల కనీస మొత్తంగా పేర్కొంటుండగా, ఖాతా ప్రారంభించేటప్పుడు కనీసం రూ.250 జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో చిన్న మొత్తాల డిపాజిట్లపై లావాదేవీ ఛార్జీలు ఉండవని వెల్లడించారు.
తక్కువ ఆదాయం ఉన్నవారే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి
స్థిరమైన నెలవారీ ఆదాయం లేని వారిని కూడా పెన్షన్ వ్యవస్థలోకి తీసుకురావడంపై PFRDA ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ డెలివరీ భాగస్వాములు, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వీరికి ప్రతినెలా ఒకే మొత్తాన్ని పొదుపు చేయడం కష్టమైనప్పటికీ, ఆదాయం వచ్చినప్పుడు చిన్న మొత్తాలను జమ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు పెన్షన్ పొదుపునకు దూరంగా ఉన్నవారు కూడా తమ భవిష్యత్తు కోసం నిధిని ఏర్పాటు చేసుకునే అవకాశం లభిస్తుంది. పొదుపు అలవాటును పెంపొందించడంతో పాటు దేశంలో పెన్షన్ కవరేజీని విస్తరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా చెబుతోంది PFRDA..
బ్యాంకులకు కూడా కమీషన్ ప్రయోజనం
NPS తత్కాల్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునే బ్యాంకులకు కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించనున్నారు. ప్రతి కొత్త ఖాతా ప్రారంభించినందుకు బ్యాంకులకు రూ.100 ఆన్‌బోర్డింగ్ ఫీజు చెల్లిస్తారు. అలాగే ఖాతాలోని మొత్తం నిధులపై ఏడాదికి 0.2 శాతం కమీషన్ లభిస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ పెన్షన్ ఖాతాలో రూ.లక్ష ఉంటే, దానిపై బ్యాంకుకు ఏడాదికి సుమారు రూ.200 కమీషన్ వస్తుంది. పెన్షన్ ఖాతాలు దీర్ఘకాలికంగా కొనసాగుతాయి కాబట్టి బ్యాంకులకు కస్టమర్లతో దీర్ఘకాలిక సంబంధాలు ఏర్పడతాయని PFRDA భావిస్తోంది. NPS ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో కూడిన పదవీ విరమణ పెట్టుబడి ఉత్పత్తుల్లో ఒకటని పేర్కొంటున్నారు..
దేశంలో పెన్షన్ పరిధి ఇంకా విస్తరించాల్సిందే!
భారత్‌లో సుమారు 60 కోట్ల మంది కార్మిక శక్తి ఉండగా, NPS, అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాల పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని PFRDA పేర్కొంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, NPSలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన చందాదారులు ఉన్నారు. సుమారు 1.5 కోట్ల మంది ప్రభుత్వ రంగ చందాదారులు, కోటి మంది ప్రభుత్వేతర రంగ చందాదారులు ఉన్నట్లు వెల్లడించారు. దేశంలోని ప్రతి ఆరుగురు కార్మికుల్లో ఒకరు మాత్రమే పెన్షన్ పథకాలతో అనుసంధానమయ్యారనే అంచనాను సంస్థ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో పెన్షన్ వ్యవస్థను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది.
రెండేళ్లలో 5 కోట్ల మంది కొత్త చందాదారులే లక్ష్యం!
రాబోయే రెండు నుంచి మూడేళ్లలో NPSలోకి మరో 4 కోట్ల నుంచి 5 కోట్ల మంది కొత్త చందాదారులను తీసుకురావాలని PFRDA లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2040 కంటే ముందే పెన్షన్ నిధి మొత్తం విలువను రూ.100 లక్షల కోట్లకు చేర్చాలని ప్రణాళిక రూపొందించింది. డిజిటల్ సదుపాయాలు, సులభమైన ఖాతా ప్రారంభ ప్రక్రియ, చిన్న మొత్తాల పొదుపు విధానంతో సామాన్యులకు కూడా పెన్షన్ వ్యవస్థను చేరువ చేయాలని భావిస్తోంది. దేశాన్ని పెన్షన్ ఆధారిత సమాజంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని PFRDA చెబుతున్న మాట.. మొత్తంగా చూస్తే.. ప్రతిరోజూ పెద్ద మొత్తంలో పొదుపు చేయలేని వారికి NPS తత్కాల్ మంచి అవకాశంగా మారే అవకాశం ఉంది. రోజుకు రూ.10 వంటి చిన్న మొత్తంతోనే పదవీ విరమణ కోసం పొదుపు ప్రారంభించేందుకు వీలు కల్పించడం ఈ విధానంలోని ప్రత్యేకత. అయితే ఇది మార్కెట్ ఆధారిత పెన్షన్ పెట్టుబడి విధానం కావడంతో రాబడులు హామీగా ఉండవని, పెట్టుబడికి సంబంధించిన నిబంధనలు, రిస్క్‌లను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే మంచిది..

