Site icon NTV Telugu

Nizamabad Boy Kidnap: నిజామాబాద్ కిడ్నాప్ కథ సుఖాంతం.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు! పిల్లలు లేరని..

Nizamabad Boy Kidnap

Nizamabad Boy Kidnap

Nizamabad Govt Hospital Boy Kidnap Update: నిజామాబాద్ జిల్లా కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలుడు అరుణ్ ఆచూకిని పోలీసులు కనుగొన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. పోలీసులు బాలుడిని అప్పగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాపర్ల నుంచి రక్షించిన పోలీసులకు అరుణ్ తండ్రి సాయినాథ్ ధన్యవాదాలు తెలిపాడు. కుమారుడు మళ్లీ తమ దగ్గరికి వస్తాడనుకోలేదని సాయినాథ్ కన్నీరుమున్నీరయ్యాడు.

మానిక్‌ బండార్‌కు చెందిన ఛాయా ప్రసవం కోసం నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. డాక్టర్లు మరుసటి రోజు డెలివరీ చేస్తామని చెప్పడంతో.. సాయినాథ్‌ తన మూడేళ్ల కొడుకు అరుణ్‌తో కలిసి ప్రసూతి విభాగం ఎదురుగా ఉన్న వరండాలో పడుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో లేచి చూడగా.. పక్కన నిద్రిస్తున్న కొడుకు కనిపించలేదు. ఎక్కడ వెతికినా అరుణ్ కనిపించలేదు. దాంతో సాయినాథ్‌ బోరున ఏడ్చాడు. ఆపై ఆసుపత్రి భద్రత సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read: Bowenpally Crime News: బోయిన్‌పల్లిలో దారుణం.. భార్య, కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త!

ఆసుపత్రి సీసీఫుటేజీలు పరిశీలించగా ఇద్దరు యువకులు వచ్చి సాయినాథ్‌ పక్కన నిద్రిస్తున్నట్లు నటించి.. అరుణ్‌ను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరు బృందాలుగా విడిపోయి గాలించారు. వ్యక్తుల దుస్తుల ఆధారంగా ఎటు వెళ్లారో కనుక్కున్నారు. దుండగులు ఆర్మూర్‌ పట్టణం మీదుగా కరీంనగర్‌ వైపు వెళ్తున్నట్లు గమనించారు. ఈ క్రమంలో మెట్‌పల్లిలో నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసున్నారు. అపహరణకు గురైన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. తన చెల్లికి పిల్లలు లేరని, ఆ లోటు తీర్చేందుకు అరుణ్‌ను కిడ్నాప్ చేసినట్టు కిడ్నాపర్ తెలిపాడు.

Exit mobile version