Site icon NTV Telugu

Blindsight: మస్క్ ఆవిష్కరణలో పురోగతి.. పుట్టుకతోనే చూపులేని వారు ఇప్పుడు ప్రపంచాన్ని చూడొచ్చు!

Musk

Musk

Blindsight: పుట్టుకతోనే చూపు లేని వారు కూడా చూడగలిగేలా చేసే ఒక బ్రెయిన్ ఇంప్లాంట్ ఉంటే ఎలా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కలను నిజం చేసే దిశగా ఎలాన్ మస్క్ స్థాపించిన కాలిఫోర్నియా సంస్థ న్యూరాలింక్ (Neuralink) కీలక అడుగులు వేస్తోంది. 2026లో తొలిసారి మనుషులపై పరీక్షలు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. పుట్టుగుడ్డి వారికి సైతం చూపు తెచ్చేందుకు రూపొందించిన న్యూరాలింక్ బ్రెయిన్ చిప్‌కు ‘బ్లైండ్‌సైట్’ అనే పేరు పెట్టారు. ఈ పరికరానికి 2024 సెప్టెంబర్‌లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుంచి “బ్రేక్‌థ్రూ డివైస్” గుర్తింపు లభించింది. ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ఔషధాలు లేదా వైద్య పరికరాల అభివృద్ధి, పరిశీలనను వేగవంతం చేయడానికి ఈ గుర్తింపును ఇస్తారు. ఇప్పుడు బ్లైండ్ సైట్‌కు గుర్తింపు రావడం విశేషం!

READ MORE: Auto Drivers Protest: అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు..

గతేడాది మార్చిలో ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో బ్లైండ్‌సైట్ ఇంప్లాంట్ ఇప్పటికే కోతుల్లో పనిచేస్తోందని ప్రకటించారు. మొదట్లో దాని రిజల్యూషన్ తక్కువగా ఉంటుందని, కానీ భవిష్యత్తులో సాధారణ మనిషి చూపును కూడా మించవచ్చని ఆయన అన్నారు. 2026 ప్రారంభానికి న్యూరాలింక్ బ్లైండ్‌సైట్‌ను తొలిసారిగా మనుషుల మెదడులో అమర్చేందుకు సిద్ధమవుతోందని.. పుట్టుకతోనే చూపు లేని వ్యక్తులకు కనీస స్థాయి చూపును అందించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. జనవరి 1న ఎలాన్ మస్క్ మరోసారి ఈ ప్రాజెక్టుపై ఎక్స్‌లో స్పందిస్తూ.. న్యూరాలింక్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ పరికరాలను భారీ స్థాయిలో తయారు చేయడం ప్రారంభిస్తామని, భవిష్యత్తులో పూర్తిగా ఆటోమేటెడ్ శస్త్రచికిత్స విధానాన్ని సైతం ప్రవేశపెడతామని తెలిపారు. ఈ పరికరంలోని సన్నని తంతువులు మెదడు, స్పైనల్ కార్డ్‌ను కప్పే గట్టి పొర అయిన ‘డ్యూరా’ను తొలగించకుండానే దానిలోకి వెళ్లగలగడం చాలా ముఖ్యమైన విషయం అని ఆయన పేర్కొన్నారు. కళ్లూ, ఆప్టిక్ నర్వ్ రెండూ కోల్పోయిన వారు సైతం బ్లైండ్‌సైట్ సహాయంతో చూడగలరని చెప్పారు. మెదడులోని విజువల్ కార్టెక్స్ సరిగా ఉంటే, పుట్టుకతోనే చూపు లేని వారిలో కూడా చూపును తిరిగి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రారంభంలో ఈ పరికరం చూపించే దృశ్యాలు పాత అటారి వీడియో గేమ్స్‌లా తక్కువ నాణ్యతతో ఉంటాయని, కానీ క్రమంగా అది అభివృద్ధి చెందుతుందని మస్క్ తెలిపారు. మరోవైపు.. బ్లైండ్‌సైట్ లాంటి పరికరాల భద్రత, పనితీరుపై శాస్త్రవేత్తల వర్గాల్లో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఇవి నిజంగా ఎంతవరకు సురక్షితమో, ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయో కాలమే తేల్చాల్సి ఉంది.

Exit mobile version