NTV Telugu Site icon

NEET PG: నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ పరీక్ష.. రాష్ట్రంలో 10 పరీక్ష కేంద్రాలు

Neet Pg 2023

Neet Pg 2023

NEET PG: దేశవ్యాప్తంగా 2023-24లో వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) మెడికల్‌ సీట్ల భర్తీకి నేడు నీట్‌ ప్రవేశపరీక్ష జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సులకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2,453 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థల్లో 1,393, ప్రైవేటులో 1,060 సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా.. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ కేంద్రాల్లో నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీలోపు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Read Also: Cabinet Meeting: ఈ నెల 9న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

దేశవ్యాప్తంగా మొత్తం 271 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సు్లతోపాటు పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేండ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్, ఈడబ్యూఎస్ అభ్యర్థులు 50 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 40 పర్సంటైల్‌ సాధించాలి. దిల్లీ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్‌, చండీగఢ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పుదుచ్చేరిలోని జిప్‌మర్‌, బెంగళూరులోని నిమ్‌హాన్స్‌, త్రివేండ్రంలోని చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థల్లో అడ్మిషన్లకు నీట్‌ ప్రవేశ పరీక్ష వర్తించదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

నీట్‌ పీజీ 2023 పరీక్ష మార్గదర్శకాలు
*నీట్ పీజీ 2023 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి కనీసం 2 గంటల ముందుగా ఉదయం 7 గంటలకు చేరుకోవాలని సూచించారు.

*అభ్యర్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డును తమ వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేని వారిని పరీక్ష హాలులోకి అనుమతించరు.

*అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని కోవిడ్-19 మరియు ఇన్‌ఫ్లుఎంజా సేఫ్టీ ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా పాటించాలి అంటే మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం, రెగ్యులర్ హ్యాండ్ శానిటైజింగ్ మొదలైనవి.

*అభ్యర్థులు కూడా డ్రెస్ కోడ్ పాటించాలి. కంకణాలు, ఉంగరం, చెవిపోగులు, ముక్కుపుడక, చైన్, నెక్లెస్, లాకెట్లు, లాకెట్లు ఉన్న నెక్లెస్‌లు, బ్యాడ్జ్, బ్రూచ్ మొదలైన ఆభరణాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

*డయాబెటిక్ అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో చక్కెర మాత్రలు, పండ్లు, పారదర్శక వాటర్ బాటిల్ వంటి ఆహార పదార్థాలను తమతో తీసుకెళ్లవచ్చు.