Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!

  • ప్రముఖ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) ఢిల్లీలో ఆత్మహత్య
  • ఆసియా పారా గేమ్స్‌లో నీరజ్ యాదవ్ మూడుసార్లు స్వర్ణ పతకాలు
  • ఇటీవల డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో ఆయనపై నిషేధం...
Neeraj Yadav

Neeraj Yadav

Neeraj Yadav: భారత క్రీడా రంగాన్ని తీవ్ర విషాదం ముంచెత్తింది. ఆసియా పారా గేమ్స్‌లో మూడుసార్లు బంగారు పతకాలు సాధించిన ప్రముఖ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలోని తన నివాసంలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ (GTB) ఆసుపత్రికి తరలించారు.

నీరజ్ యాదవ్ మరణ వార్తను భారత పారా అథ్లెటిక్స్ ప్రధాన కోచ్ ఎస్. సత్యనారాయణ ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. “నీరజ్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం అత్యంత దురదృష్టకరం. ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే, ఒక క్రీడాకారుడు కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులను, గెలుపోటములను సంయమనంతో ఎదుర్కోవాలి. కానీ, ఆయన ఇంతటి తీవ్రమైన అడుగు వేయడం చాలా బాధాకరం” అని పేర్కొన్నారు.

డోపింగ్ సస్పెన్షన్, తీవ్ర మానసిక ఒత్తిడిF55 విభాగంలో పోటీపడే నీరజ్ యాదవ్, ఇటీవల తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయనపై నిషేధం విధించారు. దీనివల్ల ఈ నెల ప్రారంభంలో ఐచి-నగోయా వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొనే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన క్రీడాకారుడు ఇలా డోపింగ్ కారణంగా అంతర్జాతీయ ఈవెంట్‌కు దూరం కావడం ఆయనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, అదే ఈ అఘాయిత్యానికి దారితీసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆయన మరణంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలియోను జయించి.. బంగారు పతకాలతో దేశ కీర్తిని చాటినీరజ్ యాదవ్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయమైనది. ఆయన ఏడేళ్ల వయసులోనే పోస్ట్-పోలియో పక్షవాతానికి (Post-polio residual paralysis) గురయ్యారు. అయినప్పటికీ శారీరక వైకల్యాన్ని చూసి నిరాశ చెందకుండా క్రీడల్లోకి అడుగుపెట్టారు. తొలుత 2005 నుంచి 2012 వరకు వీల్‌చైర్ టెన్నిస్ ఆడిన ఆయన, ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌కు మారారు. కూర్చుని ఆడే F55 విభాగంలో షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. 2023 హాంగ్జౌ ఆసియా పారా గేమ్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి జావెలిన్ త్రో, డిస్కస్ త్రో రెండింటిలోనూ రెండు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. భారత పారా క్రీడారంగానికి ఎనలేని సేవలందించిన ఒక ఛాంపియన్ అథ్లెట్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల క్రీడా ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.