Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి

  • ట్రంప్‌కు మళ్లీ నిరాశ
  • చేజారిన శాంతి బహుమతి
  • దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవీ పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం
Nobel Peace Prize1

Nobel Peace Prize1

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఏడాదైనా నోబెల్ శాంతి బహుమతి లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. 8 యుద్ధాలు ఆపిన తనకే శాంతి బహుమతి వస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం “నవీ” పిళ్లైను వరించింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. శాంతి పరిరక్షణ, అంతర్జాతీయ చట్టాల ప్రోత్సాహానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.

గతేడాది నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నేత కొరినా మచాడోను వరించింది. ఈ ఏడాదైనా తనకు నోబెల్ శాంతి బహుమతి లభిస్తుందని ట్రంప్ ఆశ పడ్డారు. కానీ ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురైంది. ఈ వారంలో ప్రకటించిన నోబెల్ పురస్కారాల్లో శాంతి బహుమతి ఐదోది. ఇప్పటికే సాహిత్యం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, వైద్య రంగాల్లో విజేతలను ప్రకటించారు.

తమిళ కుటుంబంలో జననం

నవీ పిళ్లై దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో భారత తమిళ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. మానవ హక్కుల పరిరక్షణ, అన్యాయంపై పోరాటమే లక్ష్యంగా ఆమె తన న్యాయవాద వృత్తిని కొనసాగించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలకు న్యాయ సహాయం అందించారు. 1967లో సొంతంగా న్యాయ సంస్థను కూడా స్థాపించారు. తర్వాత ఆమె ఉన్నత విద్య కోసం అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1988లో అక్కడ డాక్టర్ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ (SJD) డిగ్రీ పొందారు. 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, ఆ దేశ న్యాయవ్యవస్థలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు.

రువాండా ట్రిబ్యునల్‌లో కీలక బాధ్యతలు

1999లో నవీ పిళ్లై అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ ఫర్ రువాండా (ICTR)లో న్యాయమూర్తిగా, అనంతరం అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె పదవీకాలంలో లైంగిక హింస, అత్యాచారం, ప్రచారం ద్వారా ద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి చర్యలు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమానికి సంబంధించిన కేసుల్లో విచారణకు ఆధారాలుగా నిలవగలవని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ న్యాయవ్యవస్థలో బాధితులకు న్యాయం అందించేందుకు ఆమె చేసిన కృషి ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)లోనూ న్యాయమూర్తిగా సేవలందించారు. 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా కూడా పనిచేశారు.

పాలస్తీనా అంశంపైనా విచారణ

అంతర్జాతీయ న్యాయ, మానవ హక్కుల సంస్థల్లో నవీ పిళ్లై తన సేవలను కొనసాగించారు. 2021 నుంచి 2025 వరకు ఆక్రమిత పాలస్తీనా భూభాగాలకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు అధ్యక్షత వహించారు. అలాగే మయన్మార్‌పై మారణహోమం ఆరోపణలకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో జరిగిన విచారణ ప్రక్రియలో 2019లో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

నవీ పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తుచేసింది. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఐరాస మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి షబియా మంటూ.. “ఇది అద్భుతమైన వార్త. మానవ హక్కుల కోసం మరింత అంకితభావం, నిబద్ధత అవసరం” అని వ్యాఖ్యానించారు.

డిసెంబర్ 10న అవార్డు ప్రదానం

నోబెల్ శాంతి పురస్కారం కింద 1.2 కోట్ల స్వీడిష్ క్రోనాలు (సుమారు 12 లక్షల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతిగా అందజేస్తారు. ఈ అవార్డును డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేయనున్నారు. నోబెల్ పురస్కారాల వ్యవస్థాపకుడు, స్వీడిష్ పారిశ్రామికవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 10న అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తారు. మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం, శాంతి పరిరక్షణ రంగాల్లో నవీ పిళ్లై చేసిన సేవలకు ఈ పురస్కారం అంతర్జాతీయ గుర్తింపుగా నిలవనుంది.