Munakkaya Pachadi Recipe: మన తెలుగు వారు పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఇస్తారనడంలో ఎటువంటి అపనమ్మకం అవసరం లేదు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఏదైనా పచ్చడి తింటే వచ్చే రుచి వేరే లెవెల్ అంతే.. అలాంటి పచ్చళ్లలో ‘మునక్కాయ నిల్వ పచ్చడి’ కూడా ఒకటి. ఈ పచ్చడి కేవలం రుచికరంగానే కాకుండా.. ఆరోగ్యంగా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ పచ్చడిని సరైన కొలతలతో చేస్తే ఆరు నెలల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. పెరుగన్నం, పప్పు లేదా సాధారణ భోజనంతో కూడా ఈ పచ్చడి అద్భుతంగా సరిపోతుంది. మరి ఈ టేస్టీ మునక్కాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
* మునక్కాయలు – 6 (సుమారు 500 గ్రాములు)
* చింతపండు – 125 గ్రాములు
* నీరు – సుమారు 400 ml
* పసుపు – 1 టీ స్పూన్
* వేరుశెనగ నూనె – 350 ml
* ఆవాలు – 1 టేబుల్ స్పూన్ + తాలింపుకు 1½ టీ స్పూన్లు
* మెంతులు – 2 టేబుల్ స్పూన్లు
* కల్లుప్పు – 70 గ్రాములు
* కారం – 65 నుంచి 75 గ్రాములు
* వెల్లుల్లి రెబ్బలు – 50 గ్రాములు
* ఎండుమిర్చి – 6
* కరివేపాకు – 2 రెమ్మలు
* ఇంగువ – పావు టీ స్పూన్.
తయారీ విధానం:
మునక్కాయలు కట్టింగ్:
పచ్చడికి ఉపయోగించే మునక్కాయలు చాలా లేతగా ఉండకూడదు, అలాగే పూర్తిగా ముదిరిపోయినవీ కాకూడదు. కండ బాగా ఉండే మునక్కాయలు తీసుకుంటే పచ్చడి రుచిగా వస్తుంది. ముందుగా మునక్కాయలను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరబెట్టాలి. తర్వాత రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైపొర తీసేయకుండా కట్ చేయాలి.
చింతపండు గుజ్జు తయారీ:
చింతపండును ఒక గిన్నెలో వేసి సుమారు 250 ml నీటిలో నానబెట్టాలి. వేడి నీళ్లు వాడితే త్వరగా నానుతుంది. తర్వాత బాగా పిసికి చిక్కటి గుజ్జును తీసుకోవాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీరు పోస్తూ మొత్తం 400 ml వరకు గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జులో పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి చిన్న మంటపై 15 నిమిషాలు ఉడికించాలి. చింతపండులోని పచ్చిదనం పోయి చిక్కగా మారిన తర్వాత దించాలి.
మసాలా పొడి తయారీ:
ఒక పాన్‌లో ఆవాలు, మెంతులు వేసి సన్నని మంటపై దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిలో కల్లుప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి పచ్చడికి ప్రత్యేక రుచిని ఇస్తుంది.
వేయించడం:
పాన్‌లో వేరుశెనగ నూనె వేడి చేసి మునక్కాయ ముక్కలను రెండు నుంచి మూడు నిమిషాలు లైట్‌గా వేయించాలి. అవి పూర్తిగా మెత్తబడకూడదు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మరో నిమిషం కలిపి దించాలి. అదే నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. చివర్లో ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి.
పచ్చడి కలిపే విధానం:
ఒక పెద్ద గిన్నెలో వేయించిన మునక్కాయ ముక్కలు, వెల్లుల్లి, గ్రైండ్ చేసిన పొడి, కారం వేసి బాగా కలపాలి. తర్వాత చల్లారిన చింతపండు గుజ్జు పోసి మరోసారి కలపాలి. చివరగా తాలింపు నూనె కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. పచ్చడి మీద నూనె తేలేలా మూత పెట్టి ఒకటి లేదా రెండు రోజులు ఊరనివ్వాలి. అప్పుడు పచ్చడి రుచి మరింత బాగుంటుంది. పచ్చడికి తడి తగలకుండా చూసుకోవాలి. ఉప్పు సరైన మోతాదులో ఉంచి, నూనె పైకి తేలుతూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మునక్కాయ పచ్చడి ఆరు నెలల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచితే ఇంకా ఎక్కువకాలం రుచిగా ఉంటుంది.
