NTV Telugu Site icon

Mulayam Singh Yadav Passes Away: రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు..

Mulayam

Mulayam

Mulayam Singh Yadav Passes Away: గత వారం రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) ప్రాణాలు విడిచారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో గల మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రి మృతి చెందినట్లు కుమారుడు అఖిలేష్‌ యాదవ్ ట్వీట్ చేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన జీవిత కాలంలో 8సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1989లో తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కేంద్ర రక్షణ మంత్రిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా పదవిలో ఉన్నారు.

ములాయం సింగ్‌ యాదవ్ ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్‌ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్‌ యాదవ్‌ దంపతులకు జన్మించారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ యాదవ్‌.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యుడిగా 10 సార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. లోక్‌సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ఉత్తర్​ప్రదేశ్‌ను ములాయం అభివృద్ధి పథంలో నడిపించారు. యూపీలో అనేక సంస్కరణలను పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ములాయం మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్‌యాదవ్. రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్‌ యాదవ్. ప్రముఖ సోషలిస్ట్ నాయకులు రామ్ మనోహర్ లోహియా, సీనియర్ నేత దివంగత రాజ్‌నారాయణ్‌ స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారు.

దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును దగ్గరగా పరిశీలించిన కురువృద్ధుడి మరణంతో ఉత్తరప్రదేశ్ సహా దేశమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ములాయం చాలా కాలం పాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర స్థితి విధించినప్పుడు ములాయం 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి.. తన పోరాట పటిమతో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. పదిసార్లు ఎమ్మెల్యేగా.. ఏడుసార్లు ఎంపీగా గెలిచి.. రాజకీయ రణరంగంలో తనకు తిరుగులేదని ములాయం నిరూపించుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన ఈ రాజకీయ కురువృద్ధుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిగెత్తించారు.

ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల సంతాప దినాలు ప్రక‌టించారు. ములాయం మృతి ప‌ట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి అధికార లాంఛ‌నాల‌తో ములాయం అంత్యక్రియ‌లు నిర్వహించ‌నున్నారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్‌తో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్‌లో మాట్లాడారు. సామాజిక సిద్ధాంతం కోసం ములాయం తుది వ‌ర‌కు పోరాటం చేశార‌ని సీఎం యోగి ఓ ప్రక‌ట‌న‌లో తెలిపారు. యూపీ స్పీక‌ర్ స‌తీశ్ మ‌హానా కూడా ములాయం మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు.

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం అన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Show comments