NTV Telugu Site icon

Ujjaini Mahankali Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన పొన్నం ప్రభాకర్!

Ponnam Prabhakar Bonalu

Ponnam Prabhakar Bonalu

Minister Ponnam Prabhakar pooja at Ujjaini Mahakali Temple: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ లార్సన్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్.. మొదటి బోనం సమర్పించారు. అనంతరం ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘అమ్మవారి దయవల్ల వర్షాలు సమృద్ధిగా పడి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. బోనాల జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు హైదరాబాద్ నగర ప్రజలు వారికి ఆతిథ్యం ఇచ్చి.. అమ్మవారి దర్శనం కలిగేలా చూడాలి. ప్రజల సహకారంతోనే జాతర విజయవంతం అవుతుంది. హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల జాతరను విజయవంతంగా నిర్వహిస్తాం’ అని అన్నారు.

సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వంఅన్ని శాఖలతో పటిష్ట ఏర్పాట్లు చేసింది. మహంకాళి అమ్మవారి దర్శనానికి ఆరు వేర్వేరు క్యూ లైన్లు ఉన్నాయి.
ప్రతి క్యూ లైన్‌కి ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేశారు. బోణంతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్స్ ఉంటాయి. వీఐపీల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. శివశక్తులకు ఇబ్బంది కలుగకుండా వారికి కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు.

Also Read: Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో యాంటీ సెక్స్ బెడ్స్.. ఇక అథ్లెట్లకు కష్టమే!

భక్తుల రద్దీ దృష్ట్యా శివశక్తుల కోసం ప్రత్యేక సమయంను ఆలయ అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 1:30 నుండి 4:00 గంటల వరకు శివశక్తుల కోసం సమయం కేటాయించారు. ఒక్క శివశక్తి, జోగినీలతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 100 సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. ఈ రోజు ఉదయం బోనాలతో ప్రారంభమై.. రేపు రంగం భవిష్యవాణి, అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగుస్తుంది. నగర నలుమూలల నుండి వచ్చే భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు.