త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తేబోతున్నాం అని, వర్గీకరణలో ఎవరి వాట వాళ్లకు అందుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సభలో అమలుకు నిర్ణయం తీసుకోవడం మాములు విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. మార్చి 3న రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత సభ ఉంటుందని మంత్రి దామోదర తెలిపారు. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు మంత్రి దామోదర, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే వీరేశం హాజరయ్యారు.
ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వారికి మంత్రి దామోదర రాజనర్సింహ నివాళులు అర్పించారు. వర్గీకరణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల కాళ్లను మంత్రి కడిగారు. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఆర్ధిక సాయం అందించనున్న తెలిపారు. మంత్రి దామోదర మాట్లాడుతూ… ‘వర్గీకరణ ఉద్యమం అసహనం, అభద్రతల నుండి వచ్చింది. పోరాటం ఎవరికి వ్యతిరేకం కాదు . వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగం జాతికి కనువిప్పు. ఉప కులాల అందరికీ న్యాయం జరగాలి. సుప్రీంకోర్టు కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సభలో అమలుకు నిర్ణయం తీసుకోవడం మాములు విషయం కాదు. ఆ నిబద్ధత సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. ఎవరు ఎన్ని వంకలు పెట్టినా.. ఏక సభ కమిషన్ అద్భుతమైన నివేదిక ఇచ్చింది. 52 లక్షల జనాభా ఉంటే.. 33 కులాలు ముట్టుకోలేదు. త్వరలోనే వర్గీకరణ చట్టం తేబోతున్నాం. వర్గీకరణలో ఎవరి వాట వాళ్ళకు అందుతుంది. అందుకు రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అబద్ధాలు, మోసం ఎక్కువ కాలం పని చేయవు’ అని అన్నారు.
అమరవీరుల వల్లనే మాదిగల వర్గీకరణ సాధ్యమైందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అందరం అండగా ఉండాలన్నారు. 30 ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నిజం అవుతుందని, అమరవీరుల స్మారకం ఏర్పాటు చేయాలని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. మాదిగ, అనుబంధ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరిగింది. కాలే యాదయ్య, తోట లక్ష్మీ కాంతారావు, డాక్టర్ ఏ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్, మాజీ ఎంపీ పసునూరు దయాకర్ సహా మాదిగ, మాదిగ అనుబంధ కులాల ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.