NTV Telugu Site icon

AP Cabinet Decisions: వారందరికీ శుభవార్త చెప్పిన కేబినెట్‌..

Chelluboyina Venu Gopala Kr

Chelluboyina Venu Gopala Kr

AP Cabinet Decisions: సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది.. కేబినెట్‌ ముగిసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను, ఆమోదం లభించిన అంశాలను, వాటి ద్వారా ఎవరికి లబ్ధి చేకూరనుంది అనే వివరాలను వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. ఈనెల 18న జగనన్న తోడు ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదించింది.. ఈనెల 21న నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు.. 80,600 మందికి 300 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేందుకు ఆమోదం వేశారు. ఈ నెల 24న సీఆర్డీఏ ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.. 50 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లబ్ధి జరగనుంది. ఈనెల 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ చేస్తారు.. ఈ నెల 28న జగనన్న విదేశీ విద్య కింద.. రూ.50 కోట్లు వెచ్చిస్తూ.. 400 మంది విద్యార్థులకు ప్రయోజనానికి కేబినెట్‌ ఆమోదించిందని వెల్లడించారు.

ఇక, భూమి లేని నిరుపేదలకు అసైన్ భూములపై కీలక నిర్ణయం తీసుకున్నాం.. వీటి పై ఉన్న ఆంక్షలు తొలిగించి 54 వేల ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించాం.. 46 వేల 930 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు మంత్రి వేణు గోపాల కృష్ణ.. లంక భూములు కూడా కలిపితే సుమారు 63 వేల ఎకరాల భూమిపై 66 వేల మందికి పూర్తి హక్కులు దక్కనున్నాయి.. 20 ఏళ్ళ పాటు అసైన్డ్ భూమిని అనుభవిస్తున్న వారికి ఈ ప్రయోజనం దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు భూమి అనుభవించటమే కాని అసైన్డ్ భూమి పై లబ్దిదారులకు హక్కు ఉండేది కాదన్నారు.. ఇక, అవసరమైన గ్రామాల్లో శ్మశాన వాటికల కోసం భూమి కొనుగోలు చేస్తాం.. బేతంచర్ల, గుంతకల్, మైదుకూరులలో పాలిటెక్నిక్ కళాశాలలు ప్రతిపాదనకు ఆమోదం లభించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేశారని తెలిపారు.

మరోవైపు.. ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధమైంది.. విద్యా సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆమోదం లభించింది.. జేఎన్టీయూ కాకినాడకు బోధనేతర సిబ్బంది నియామకానికి ఆమోదం లభించగా.. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించటానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం గుర్తించింది.. 62 ఏళ్లకు రిటైర్ అయిన బోధనా సిబ్బందిని 65 ఏళ్ళ వరకు కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని నిర్ణయించింది. మెడికల్ కాలేజీల్లో 706 పోస్టులకు ఆమోద ముద్ర పడగా.. ఒక్క వైద్య, ఆరోగ్య రంగంలోనే మా ప్రభుత్వం 50 వేల మందిని నియమించటం చారిత్రాత్మకంగా పేర్కొన్నారు. ఏపీ వైద్య విధాన పరిషత్ విలీనానికి ఆర్డినెన్స్‌ తీసుకుని రావటానికి కేబినెట్‌ ఆమోదించింది. కడప జిల్లా గండికోట వరద బాధితులకు నష్టపరిహారానికి ఆమోదం లభించింది. 10 వేల మందికి పునరావాస ప్యాకేజీకి కింద.. ఒక్కో బాధితుడికి 10 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించనున్నారు.

కడప జిల్లాలో పంపు స్టోరేజ్ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. రూ.8104 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు పెట్టనుంది జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌.. 2450 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల, కడప జిల్లాలో ప్రాజెక్టులకు ఆమోదం లభించగా.. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూకేటాయింపుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఏపీ మ్యారిటైం బోర్డు రుణానికి ఆమోద ముద్ర వేశారు. ఇండిగో సంస్థకు మరో ఏడాది పాటు వయబులిటీ గ్యాప్ కొనసాగింపుకు ఆమోదం పొందగా.. అర్చకులకు రిటైర్మెంట్ అనేది లేకుండా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం.