NTV Telugu Site icon

IND vs NZ: అప్పుడు తెలియదు.. రాత్రంతా మేల్కొని ఉన్నా: సత్య నాదెళ్ల

Satya Nadella

Satya Nadella

Microsoft CEO Satya Nadella React on IND vs NZ Semi Final 2023: వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా బుధవారం ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కోట్లాది మంది వీక్షించారు. ఓ దశలో మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో సెమీ ఫైనల్‌ను యావత్‌ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది. బుధవారం మధ్యాహ్నం నుంచే మిలియన్ల మంది క్రికెట్ అభిమానులు టీవీ స్క్రీన్‌లకు అతుక్కుపోయారు. ఇందులో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో కీలక ఉపన్యాసం చేసిన తర్వాత భారత్, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించినట్లు సత్య నాదెళ్ల తెలిపారు. మ్యాచ్ కోసం తాను రాత్రంతా మేల్కొని ఉన్నట్లు చెప్పారు. ‘వన్డే ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్ జరిగే రోజునే మేము ఇగ్నైట్ (కాన్ఫరెన్స్ పేరు) షెడ్యూల్ చేశామని తెలియదు. మ్యాచ్ కోసం నేను రాత్రంతా మేల్కొని ఉన్నాను. ఐదు నిమిషాల క్రితం మ్యాచ్ పూర్తయింది. భారత్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.

Also Read: IND vs NZ: వన్డే ప్రపంచకప్ ఆడతానని 2011లోనే నా స్నేహితులకు చెప్పా!

వరల్డ్‌కప్‌ 2023 తొలి సెమీస్‌లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్ (105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకాలు బాదారు. ఆపై మహ్మద్ షమీ (7/57) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో లక్ష్య ఛేదనలో కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకుఆలౌటైంది. ఈ విజయంతో భారత్ వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ చేరింది.