Michael Vaughan: టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి టీమిండియా చరిత్ర సృష్టించిన వేళ.. భారత జట్టు ప్రస్థానంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో పెను దుమారం రేపుతున్నాయి. సాధారణంగా భారత జట్టుపై ఏదో ఒక విమర్శ చేసే వాన్, ఈసారి మాత్రం దక్షిణాఫ్రికా జట్టును టార్గెట్ చేస్తూ ‘తెలివితక్కువ జట్టు’ అని సంబోధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్‌ను టోర్నీ నుంచి తరిమేసే అవకాశం వచ్చినా వాడుకోలేకపోయారంటూ ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు దక్షిణాఫ్రికాను వాన్ ఎందుకు విమర్శించారు? భారత్ గెలుపు వెనుక సౌతాఫ్రికా చేసిన ఆ ‘పొరపాటు’ ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Anasuya: వ్యూస్ కోసం అనసూయపై వికృత చేష్టలు.. వ్యక్తి అరెస్ట్
టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలవడంపై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ తనదైన శైలిలో స్పందించారు. ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, దక్షిణాఫ్రికా చేసిన ఒక పొరపాటు వల్లే భారత్ కప్ గెలవగలిగిందని విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”ఈ టోర్నమెంట్‌లో అత్యంత తెలివితక్కువ జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికానే. సూపర్-8 దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే, భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించేది. కానీ, ఆ మ్యాచ్‌లో గెలిచి టీమ్ ఇండియా రేసులో ఉండేలా సౌతాఫ్రికా అవకాశం కల్పించింది. మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే, మీకంటే బలమైన జట్టును టోర్నీ ప్రారంభంలోనే ఇంటికి పంపాలి. కానీ సౌతాఫ్రికా ఆ పని చేయలేకపోయింది” అని వాన్ విమర్శించారు.
సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయి, భారత్ సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలు సాధించి భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి, ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు అవకాశం ఇచ్చిన దక్షిణాఫ్రికా మాత్రం సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ లాంటి పటిష్టమైన జట్టుకు లైఫ్ లైన్ ఇవ్వడమే దక్షిణాఫ్రికా చేసిన పెద్ద తప్పని మైఖేల్ వాన్ ఎద్దేవా చేశారు.
