Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!

Accident

Accident

Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు, స్పోర్ట్స్ బైక్ ఒకదానికొకటి ఢీకొనడంతో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన జిల్లాలోని పాలకొండ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్ బైక్ కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో బైక్‌పై ఉన్నవారు, కారులో ప్రయాణిస్తున్నవారికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘోర ఘటనలో మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భారీగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనతో పాలకొండ చౌరస్తా ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.