NTV Telugu Site icon

Summer solstice: రేపు ఏడాదిలోనే ‘‘సుదీర్ఘమైన పగలు’’.. అయనాంతాలు అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతాయి..?

Earth Sun

Earth Sun

Summer solstice: జూన్ 21, అంటే రేపు ఏడాదిలోనే అతి పొడవైన పగలు ఏర్పడనుంది. రాత్రి సమయంతో పోలిస్తే పగలు సుదీర్ఘంగా ఉండబోతోంది. ఈ దృగ్విషయాన్నే మనం ‘‘ వేసవి అయనాంతం’’గా వ్యవహరిస్తుంటాం. సాధారణంగా మన భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుంటుంది. ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకనొక రోజు భూమి ఉత్తరార్థ గోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. దీని వల్ల ‘వేసవి అయనాంతం’ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా జూన్ 20-21 మధ్య ఏర్పడుతుంది. ఏడాదిలో మరోసారి ఉత్తరార్థగోళం సూర్యుడికి దూరంగా వస్తుంది. ఇది డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22న జరుగుతుంది. దీనిని ‘‘ శీతాకాలపు అయనాంతం’’గా వ్యవహరిస్తారు. ఇలా ఏడాదిలో రెండుసార్లు అయనాంతాలు సంభవిస్తుంటాయి. భారతదేశంలో వేసవి అయనాంతం జూన్ 21 రాత్రి 8:09 గంటలకు సంభవిస్తుంది.

Read Also: Gorantla Butchaiah Chowdary: ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం

వేసవి అయనాంతంలో పగలు, రాత్రితో పోలిస్తే సుదీర్ఘ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతంలో రాత్రి సుదీర్ఘంగా ఉండీ, పగలు తక్కువగా ఉంటుంది. భూమి ఇలా 23.5 డిగ్రీలు వంగి తిరగడం వల్లే భూమిపై రుతువులు ఏర్పడుతుంటాయి. దీని వల్ల ఏడాదిలో సూర్యుడి కాంతి భూమిపై ఒకే విధంగా ఉండదు. కొన్ని ప్రాంతాలు సూర్యకాంతిని ఎక్కువగా పొందితే, మరో ప్రాంతం తక్కువగా పొందుతాయి. ఒక వేళ ఇలా తన అక్షంపై భూమి వంగి తిరగకుంటే, సూర్య కిరణాలు ఎప్పుడూ భూమధ్య రేఖపై నేరుగా పడుతూ ఉంటాయి. విషవత్తుల సమయంలో మార్చి 21, సెప్టెంబర్ 23న రాత్రి పగలు సమానంగా ఉంటాయి. విషవత్తుల సమయంలో సూర్య కిరణాలు భూమధ్య రేఖపై నిటారుగా ఉంటాయి. దీంతో పగలు, రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. వేసవి అయనాంతంలో ఉత్తరార్థ గోళంలో సుదీర్ఘ పగలు, దక్షిణార్థ గోళంలో తక్కువ రాత్రి ఉంటుంది. శీతాకాలపు అయనాంతంలో ఉత్తరార్థగోళంలో రాత్రి ఎక్కువగా ఉంటే, దక్షిణార్థగోళంలో పగలు తక్కువగా ఉంటుంది.