పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 131 రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలా? వద్దా? అన్నదానిపై విపక్షాలు ఓటింగ్ కోరాయి. దీంతో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా మూడు బిల్లులకు అనుకూలంగా 207 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇంత హఠాత్తుగా బిల్లులు తీసుకొచ్చారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
ఇక నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌తో సహా మూడు బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటు హక్కు రాజకీయ న్యాయమేనని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మూడు బిల్లులూ చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్ర అత్యంత అవసరం అని స్పష్టం చేశారు.
