Lionel Messi: లియోనల్ మెస్సీ ప్రపంచంలోని గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడు. అతడి కెప్టెన్సీలోనే అర్జెంటీనా 2022 ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూట్‌అవుట్‌లో ఓడించింది. ఇప్పటికీ మెస్సీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వచ్చే వరల్డ్ కప్‌కు సైతం అర్హత సాధించింది. అయితే 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ ఆడతాడా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం రావడం లేదు. 38 ఏళ్ల మెస్సీ కొన్ని సందర్భాల్లో వచ్చే వరల్డ్ కప్ ఆడతానా లేదా అన్న విషయంలో సందేహమే వ్యక్తం చేశాడు.
వాషింగ్టన్ డీసీలో జరగబోయే వరల్డ్ కప్ డ్రా ముందుగా.. ESPNకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను వరల్డ్ కప్‌లో ఆడటం గురించి అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోనీతో తరచూ మాట్లాడుతున్నానని తెలిపాడు. “నేను ఈ విషయంపై చాలా సార్లు చర్చించాం. స్కలోనీకి బాగా అర్థం చేసుకున్నాడు. నాకు అవకాశం ఉంటే మైదానంలో ఉంటాను. ఒక వేళ ఆడకపోయినా, వరల్డ్ కప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తప్పకుండా చూస్తాను. ఎందుకంటే వరల్డ్ కప్ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. మా వంటి వాళ్లకు అయితే అది మరింత భావోద్వేగంగా అనిపిస్తుంది” అని వివరించాడు. మెస్సీ ప్రకటనతో ప్రపంచ కప్‌కు ముందే మెస్సీ రిటైర్ అవుతాడా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మెస్సీకి మ్యాచ్ ఆడాలని ఉన్నప్పటికీ కోచ్, బోర్టు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది. గతంలోనూ ఈ వరల్డ్ కప్‌లో ఆడతారా? అనే ప్రశ్నలకు మెస్సీ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఓ వైపు వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది. ఈ తరుణంలోనూ మెస్సీకి క్లిరిటీ లేకపోవడం అభిమానులను గందరగోళానికి గురి చేస్తోంది.
