Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..

Least Eligible Bachelor

Least Eligible Bachelor

Least Eligible Bachelor: హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (LAB). ఐశ్వర్య హోలక్కల్ కథానాయికగా నటించగా.. ‘జబర్దస్త్’ ఫేమ్ బాబు డేగల దర్శకత్వం వహించారు. హైపర్ ఆది, శ్రీవిద్య, జీవన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం ఈటీవీ విన్ (ETV Win)తో పాటు నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. వినోదభరితంగా సాగే ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథ

పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన శ్రీనివాసరావు (ప్రేమ్ సాగర్)కు ఆస్తిపాస్తులకు కొదవలేదు. కానీ కొడుకు తేజ (హర్ష చెముడు)కు ఎంత ప్రయత్నించినా పెళ్లి కాకపోవడమే ఆయన పెద్ద బెంగ. ఊళ్లో ఏ పిల్లా పడకపోవడంతో, సిటీలో ఉద్యోగం ఉంటే సంబంధాలు వస్తాయనే ఉద్దేశంతో తేజ హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాడు. అక్కడ ‘వయోన’ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ ఆఫీసులో తేజకు టీమ్ లీడ్‌గా మధు (ఐశ్వర్య హోలక్కల్) ఉంటుంది. ఆమె కల అమెరికా వెళ్లి స్థిరపడటం.

అనుకోని పరిస్థితుల్లో పెద్దలు వీరిద్దరికీ పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. తేజకు ‘నో’ చెబుతుందనుకున్న మధు, ఆశ్చర్యకరంగా 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుందామని అంగీకరిస్తుంది. అంతేకాకుండా, ఆ ఆరు నెలలు ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉండటానికి (లివ్-ఇన్) ఒప్పందం చేసుకుంటారు. అసలు మధు ప్లాన్ ఏంటి..? పెళ్లికి ఒప్పుకొని అమెరికా వీసాకు ఎందుకు ప్రయత్నిస్తోంది..? అమాయకుడైన తేజ ప్రేమ కథ చివరకు ఏ తీరానికి చేరింది..? అనేది టీవీ స్క్రీన్ చూడాల్సిందే..

నటీనటుల పనితీరు

తేజ పాత్రలో హర్ష చెముడు తనదైన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. భారీ డైలాగులు లేకుండా అమాయకపు ముఖకవళికలు, సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సహజసిద్ధమైన నటనను కనబరిచారు. మొదట ఎంత నవ్విస్తాడో.. ఆఖరల్లో అంతగా ఏడిపిస్తాడు కూడా. ఇక మధుగా ఐశ్వర్య హోలక్కల్ సాఫ్ట్ వెర్ యువతి పాత్రలో అందంగా, హుందాగా నటించారు. సిరీస్‌కు అసలైన ఎనర్జీ హైపర్ ఆది, శ్రీవిద్య, జీవన్ కుమార్‌ల ట్రాక్. హైపర్ ఆది మార్క్ పంచ్ డైలాగులు సిరీస్ మొత్తం నవ్విస్తాయి. శ్రీవిద్య తన బోల్డ్ అండ్ నేచురల్ యాక్టింగ్‌తో సీన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీవన్ కుమార్ అమాయకపు మేనేజర్ పాత్రలో ఆఫీస్ గోయర్స్‌కు బాగా కనెక్ట్ అవుతారు. రూప శ్రావ్య, ప్రేమ్ సాగర్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

దర్శకత్వం & సాంకేతిక విభాగం

దర్శకుడు బాబు డేగలకు ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోలలో పనిచేసిన అనుభవం ఉండటంతో కామెడీ సన్నివేశాలను బాగా వర్క్ అవుట్ చూపించాడు. అయితే కథనం పరంగా పాత మూస ఫార్ములానే ఎంచుకున్నారు. అజయ్ అరసాడ సమకూర్చిన నేపథ్య సంగీతం, ఓ ట్రావెల్ సాంగ్ ఆహ్లాదకరంగా ఉన్నాయి. శరత్ అరవింద్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండి సినిమా స్థాయి అనుభూతిని ఇస్తుంది. అయితే ప్రథమార్ధంలో ఉన్న వేగం, ద్వితీయార్ధంలో కనిపించదు.

ప్లస్ పాయింట్స్:

* హర్ష చెముడు సెటిల్డ్ యాక్టింగ్, ఐశ్వర్య స్క్రీన్ ప్రెజెన్స్
* హైపర్ ఆది, శ్రీవిద్య, జీవన్ కుమార్ నవ్వించే కామెడీ ట్రాక్స్
* ఆఫీస్ నేపథ్యంలో వచ్చే సరదా సన్నివేశాలు
* కెమెరా పనితనం, సంగీతం

మైనస్ పాయింట్స్:

* రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీలైన్
* సాగదీసినట్లుండే రెండో భాగం

ఫైనల్లీ.. కథలో కొత్తదనం లేకపోయినా, పక్కా మాస్ కామెడీతో వీక్ ఎండ్ ను టైమ్‌పాస్ చేయవచ్చు.