Site icon NTV Telugu

KS Bharat: ద్రవిడ్ మాటలు నా కెరీర్‌ను మార్చేశాయి: కేఎస్ భరత్

2

2

టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రం చేయాలనేది ప్రతి క్రికెటర్ కల. ఆ అవకాశం ఒక్క రోజులోనో, నెలలోనే, ఏడాదిలోనే వచ్చేది కాదు. నిరంతర కృషి, తెలుపు రంగు జెర్సీ ధరించాలనే కసితోనే అది సాధ్యం. ఇలాంటి అవకాశాన్నే పట్టేశాడు మన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టేశాడు. గతంలో మహ్మద్ అజారుద్దీన్, వెంకటపతి రాజు, వీవీఎస్‌ లక్ష్మణ్, ఎంఎస్‌కే ప్రసాద్‌.. సిరాజ్‌ వీరంతా తెలుగు రాష్ట్రాల నుంచి భారత్‌ తరఫున టెస్టు క్రికెట్‌లో ఆడారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వైజాగ్‌కు చెందిన కోన శ్రీకర్ భరత్‌ ఈ ఘనత సాధించాడు. అతడి జెర్సీ నంబర్‌ 14. టాప్‌ బ్యాటర్ పుజారా చేతుల మీదుగా క్యాప్‌ను అందుకొన్నాడు. అరంగేట్రం చేసిన సందర్భంగా భరత్‌ తన మనసులోని మాటలను పంచుకొన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read: INDvsAUS 1st Test: జడేజా డబుల్ బొనాంజా.. కష్టాల్లో ఆసీస్

“ఎదురు చూపులకు ఫలితం దక్కింది. భారత్‌ తరఫున ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం నా కల మాత్రమే కాదు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. నా కుటుంబ సభ్యులు, నా భార్య, స్నేహితులు, కోచ్‌లు అండగా నిలిచారు. వీరి మద్దతు లేకపోతే మాత్రం ఇంతవరకూ వచ్చి ఉండేవాడిని కాదు. మరీ ముఖ్యంగా కోచ్‌ జె.కృష్ణారావు నాలోని ఆటను గమనించి తీర్చిదిద్దారు. బ్యాటింగ్‌, కీపింగ్‌ విభాగాల్లో మెలకువలు నేర్పారు. అయితే, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు జాతీయ జట్టుకు ఎంపిక అవుతానని అనుకోలేదు. నాలుగైదేళ్లు మంచి ప్రదర్శన ఇవ్వడంతో ఇప్పుడు అవకాశం రావడం మాత్రం సంతోషంగా ఉంది” అని భరత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Also Read: Bollywood: నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బాలీవుడ్ ప్రేమ జంట…

“నా జీవితం ఏమీ రాకెట్‌ వేగంతో దూసుకురాలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడి దాకా వచ్చా. భారత్ – ఏ తరఫున ఆడేటప్పుడు కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌తో పరిచయం నాలో చాలా మార్పులు తెచ్చింది. ద్రవిడ్‌తో మాట్లాడిన ప్రతిసారి నా ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చా. ‘నీ ఆటతీరును అలాగే ఆడు. ఎవరి కోసమో ఆడకు. సవాళ్లను స్వీకరిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నువ్వేం చేయగలవో అదే చేయు.. నీకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో’ అని ద్రవిడ్‌ తరచూ చెప్పేవాడు. శ్రీలంకతో అలాగే ఆడేశా. దీంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే నా కెరీర్‌పై పెను ప్రభావం చూపింది. సానుకూల దృక్పథంతో ఆడుతూ వస్తున్నా” అని భరత్ వెల్లడించాడు. 2012లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించిన భరత్‌.. 2015లో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు 79 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచుల్లో 308 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 4,289 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి.

Exit mobile version