Krishna District: డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేశారు. జూద కార్యకలాపాలైన, ఆకతాయిల వేధింపులైన, బహిరంగ మద్య సేవనమైన, చట్ట వ్యతిరేక చర్యలు ఏవైనా వారి ఆట కట్టిస్తామని కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తున్నారు. గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్లపాడు గ్రామ పరిధిలో పేకాట ఆడటానికి వచ్చారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పేకాట ఆడుతున్న 12 మంది జూదగాళ్లను గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి రూ.33,950 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరోవైపు.. మల్లాయపాలెం గ్రామ శివారులో టిడ్కో గృహాల వద్ద పేకాట ఆడుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పేకాట ఆడుతున్న 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.4500 నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో డ్రోన్ నిఘాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే మంచి ఫలితం వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్రోన్ వ్యవస్థ ద్వారా అనేక క్రైమ్‌లను అరికట్టవచ్చని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు.
Krishna District: డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే సరి..!

Krishna Police