Heavy Rains: కోల్‌కత్తాను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. వర్ష భీభత్సానికి కనీసం 30 విమానాలు ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి అంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని ఆలస్యం అయ్యాయని సమాచారం. ఈ భారీ వర్షం కారణంగా పలు ప్రమాదాలు కూడా సంభవించినట్లు నివేదికలు వస్తున్నాయి. కోల్‌కత్తాలో అనేక విద్యుత్ లైన్లు నీటిలో పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అలాగే సుమారుగా ఏడుగురు విద్యుదాఘాతంతో మరణించారని అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: Samsung Discounts: శాంసంగ్ బిగ్ సేల్.. అదనపు టీవీ, ఉచిత సౌండ్‌బార్ మీ సొంతం!
నిరంతర వర్షం కారణంగా నగరం మొత్తం జలమయం కావడంతో పాటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. వేలాది మంది ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు కనీసం 30 విమానాలు రద్దు చేయగా, మరో 31 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని కోల్‌కత్తా విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. మరిన్ని విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని సమాచారం. రాబోయే రోజుల్లో కోల్‌కత్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది.
పాఠశాలలకు సెలవులు..
భారీ వర్షం కారణంగా చాలా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. IMD నుంచి అందిన గ్రాఫ్ ప్రకారం.. నగరంలో కొన్ని గంటల్లోనే భారీ వర్షపాతం నమోదైంది. కోల్‌కత్తా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పరిధిలో అత్యధిక ఎక్కువ వర్షపాతం నమోదైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గరియా కామ్‌దహరిలో కొన్ని గంటల్లోనే 332 మి.మీ, జోధ్‌పూర్ పార్క్ 285 మి.మీ, కాళీఘాట్ 280 మి.మీ, టాప్సియా 275 మి.మీ, బల్లిగంజ్ 264 మి.మీ, ఉత్తర కోల్‌కత్తాలోని తంతానియాలో 195 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కీలక సూచనలు జారీ చేసింది. “భారీ వర్షాల కారణంగా ఈ రోజు కోల్‌కత్తాకు బయలుదేరే విమానాలు ప్రభావితం కావచ్చు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు దయచేసి మీ విమానాన్ని తనిఖీ చేయండి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
READ ALSO: Indian CEOs In US: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన రెండు దిగ్గజ అమెరికా కంపెనీలు.. సీఈఓలుగా భారతీయుల నియామకం
