Site icon NTV Telugu

KKR vs PBKS: ఐపీఎల్ 2025లో మొదటిసారి.. నాలుగో స్థానానికి పీబీకేఎస్!

Kkr Vs Pbks

Kkr Vs Pbks

ఐపీఎల్ 2025లో మొదటిసారి ఓ మ్యాచ్‌ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్‌ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ ముగిశాక వర్షం మొదలైంది. భారీ గాలులకు మైదానంను కవర్లతో కవర్ చేయడం కూడా కష్టమైంది. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆట సాధ్యం కాలేదు. వరుణుడి ప్రతాపంతో మ్యాచ్ రద్దు కావడంతో.. రెండు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. పట్టికలో ప్రస్తుతం పంజాబ్‌ నాలుగో స్థానంలో ఉండగా.. కేకేఆర్‌ ఏడో స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పీబీకేఎస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (83; 49 బంతుల్లో 6×4, 6×6), ప్రియాంశ్‌ ఆర్య (69; 35 బంతుల్లో 8×4, 4×6)లు రెచ్చిపోయారు. ఇద్దరు బౌండరీలు, సిక్సులు బాదుతూ తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియాంశ్‌ అవుట్ అయినా ప్రభ్‌సిమ్రన్‌ తగ్గలేదు. సకారియా, వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సులు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో పంజాబ్‌ 14 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 158 రన్స్ చేసింది.

అయితే 15వ ఓవర్లో వైభవ్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ ఔట్‌ అవుట్ కావడంతో పీబీకేఎస్ పరుగుల వేగం తగ్గింది. శ్రేయస్‌ అయ్యర్‌ (25 నాటౌట్‌; 16 బంతుల్లో 1×4, 1×6) క్రీజులో ఉన్నా ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోలేదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (7) మరోసారి నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లు పుంజుకోవడంతో చివరి 5 ఓవర్లలో పీబీకేఎస్ 40 పరుగులే చేయగలిగింది. ఛేదనలో కేకేఆర్ ఒక ఓవర్ అనంతరం వర్షం మొదలైంది. వర్షం ఇంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దయింది.

Exit mobile version