Site icon NTV Telugu

Pawan Kalyan: కేజీహెచ్ నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి.. చలించిన పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే..?

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మహిళ ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్‌ను పట్నాల ఉమాదేవి అనే మహిళ కలిసింది… గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్ లో చేరగా.. వైద్యులు, సిబ్బంది తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా ఎంతో అమానవీయంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. కాన్పుకి ఇచ్చిన గడువు పూర్తయ్యిందని తెలిపినప్పటికీ సాధారణ కాన్పు పేరిట నరకం చూపించారని, తన పరిస్థితి అందోళనకంగా ఉందని కుటుంబ సభ్యులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదని పవన్‌కు తెలిపింది.

READ MORE: Matrimony Fraud: మ్యాట్రిమోనీలో పెళ్లి డ్రామా.. ఒంటరి మహిళలే టార్గెట్.. చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

పైగా తన కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషించారని, కాన్పు సమయంలో తన గుండెల పైకి ఎక్క కూర్చుని సాధారణ కాన్పు పేరిట అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించింది. చివరి నిమిషం వరకు సిజేరియన్ నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా మృత శిశువుకి జన్మనివ్వాల్సి వచ్చింది. కేజీహెచ్ సిబ్బంది తీరుతో శారీరక హింసతోపాటు జీవితకాలం మనో వేదన మిగిల్చిందంటూ తన గోడు వెళ్లబోసుకుంది. తన లాంటి దుస్థితి మరో మహిళకు రాకుండా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పవన్‌ను వేడుకుంది. మహిళ వేదన విని పవన్ చలించి పోయారు. ప్రభుత్వం తరఫున తగిన భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఆయన బాధిత మహిళను కుటుంబంతో సహా సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి వెంటబెట్టుకుని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బాధిత మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి గర్భస్థ శిశువు మృతికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version