EV Road Tax Cuts: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 బడ్జెట్‌లో భాగంగా ఎలక్ట్రిక్ కార్లపై రోడ్డు పన్నును తగ్గిస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. దీంతో కొత్త ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలగనుంది. అంటే.. కేరళ ప్రభుత్వం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లపై రోడ్డు పన్నును 8 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీంతో రూ.20 లక్షల విలువైన కారుపై దాదాపు రూ.60 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే రూ.10 లక్షల వరకు ధర ఉన్న ఈవీలపై పన్నును 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించడంతో రూ.20 వేల వరకు లాభం పొందవచ్చు.
ఏ కార్లకు మార్పులు లేవు?
రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లపై పన్ను రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ విభాగంలో ఉన్న వాహనాలపై 5శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. భారత మార్కెట్లో ప్రముఖ కంపెనీలైన టాటా, ఎంజీ, హ్యుందాయ్‌కు చెందిన అనేక ఈవీలు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల శ్రేణిలోనే ఉన్నాయి.
లగ్జరీ ఈవీలపై పన్ను భారం
మరోవైపు రూ.40 లక్షలకు పైబడిన ఎలక్ట్రిక్ కార్లపై పన్నును ప్రభుత్వం 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో రూ.50 లక్షల విలువైన కారుపై అదనంగా రూ.2.5 లక్షలు, రూ.70 లక్షల కారుపై రూ.3.5 లక్షల వరకు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

