Site icon NTV Telugu

Malayalam Language Bill 2025: “భాషా యుద్ధం”.. మలయాళ భాష బిల్లు 2025పై పినరాయి విజయన్ vs సిద్ధరామయ్య

Kerala Cm Pinarayi Vijayan

Kerala Cm Pinarayi Vijayan

Malayalam Language Bill 2025: కేరళ అసెంబ్లీ ఆమోదించిన మలయాళ భాషా బిల్లు 2025పై అనేక అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై తాజాగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పష్టతనిచ్చారు. ఈ బిల్లుపై వ్యక్తమవుతున్న ఆందోళనలు వాస్తవాలకు దూరమన్నారు. ఈ బిల్లుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విజయన్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వం సెక్యులరిజం, బహుళత్వం వంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందని పోస్ట్‌లో స్పష్టం చేశారు. ఈ బిల్లులో భాషా మైనారిటీల హక్కులను కాపాడేందుకు రక్షణ నిబంధన ఉందని తెలిపారు. ముఖ్యంగా కన్నడ, తమిళం మాట్లాడే ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చట్టం రూపొందించామని చెప్పారు.

READ MORE: Divorce: కష్టపడి ఎస్ఐని చేస్తే.. భర్త ధోతీ, కుర్తా ధరిస్తున్నాడని విడాకులు కోరిన భార్య

ఈ బిల్లు ద్వారా ఏ భాషను బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదని, భాషా స్వేచ్ఛ పూర్తిగా పరిరక్షించబడుతుందని విజయన్ అన్నారు. తమిళం, కన్నడ మాతృభాషగా ఉన్నవారు సచివాలయం, శాఖాధిపతులు, స్థానిక కార్యాలయాలతో తమ మాతృభాషల్లోనే అధికారిక వ్యవహారాలు కొనసాగించవచ్చని తెలిపారు. పాఠశాలల్లోనూ మలయాళం మాతృభాష కాదని.. జాతీయ విద్యా విధానం ప్రకారం అందుబాటులో ఉన్న భాషలను ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులకు తొమ్మిది, పదో తరగతులు లేదా హయ్యర్ సెకండరీలో మలయాళ భాషలోనే పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు. కేరళ భాషా విధానం అధికార భాషల చట్టం–1963తో పాటు రాజ్యాంగంలోని సంబంధిత ఆర్టికల్స్‌కు అనుగుణంగానే ఉందని తెలిపారు. సమాఖ్య హక్కులను కాపాడుతూ, ప్రతి పౌరుడి భాషా గుర్తింపును రక్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

READ MORE: OnePlus Nord 6 Launch: 9000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. మిడ్‌రేంజ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా వన్‌ప్లస్‌ నార్డ్‌ 6!

ఇదిలా ఉండగా, సిద్ధరామయ్య తన లేఖలో ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు జిల్లాల్లో, ముఖ్యంగా కాసరగోడు వంటి ప్రాంతాల్లో, కన్నడ మాధ్యమ పాఠశాలల్లో మలయాళాన్ని తప్పనిసరి మొదటి భాషగా చేయడాన్ని కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. భాషలు పరస్పర గౌరవం, సహజ సహజీవనం వల్లే వికసిస్తాయని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ భాషను కాపాడుకునే హక్కును, ఇష్టమైన విద్యాసంస్థలను నిర్వహించుకునే స్వేచ్ఛను హామీ ఇస్తాయని, మాతృభాషలో విద్య అందించే బాధ్యత ప్రభుత్వాలదేనని సిద్ధరామయ్య గుర్తుచేశారు. ఒక భాషను ప్రోత్సహించడం మరో భాషపై భారం కాకూడదన్న సిద్ధాంతాన్ని తాము ఎప్పుడూ పాటించామని చెప్పారు. అందుకే కేరళ ప్రభుత్వం ఈ అంశంపై భాషా మైనారిటీలు, విద్యావేత్తలు, పొరుగురాష్ట్రాలతో విస్తృత చర్చ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే దేశ ఐక్యత మరింత బలపడుతుందని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.

Exit mobile version