Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..

Karthika Pournami

Karthika Pournami

Karthika Pournami: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో కార్తీక పౌర్ణమి ఒకటి. దీనిని దేవతల దీపావళి లేదా ‘దేవ దీపావళి’ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజునే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తారు. అలాగే బృందాదేవి తులసి మొక్కగా అవతరించిన రోజు, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుడు జన్మించిన రోజు కూడా ఇదేనని శాస్త్రాలు చెబుతున్నాయి. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున చేసే పూజలు, దీపారాధనలు కోటి జన్మల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి.

త్రిపురాసుర సంహార గాథ

కార్తీక పౌర్ణమికి సంబంధించిన ప్రధాన పురాణ కథ త్రిపురాసుర సంహారం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి, పరమశివుని సంతానం చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడు. దేవతల ప్రార్థన మేరకు శివపార్వతులకు వివాహం జరిగి, వారికి కార్తికేయుడు జన్మిస్తాడు. కార్తికేయుడి చేతిలో తారకాసురుడు సంహరించబడతాడు. తండ్రి మరణంతో దేవతలపై పగపెంచుకున్న తారకాసురుని కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అజేయులవుతారు. మూడు నగరాలలో నివసిస్తూ లోకాలను పీడిస్తున్న ఈ త్రిపురాసురులను పరమశివుడు ‘త్రిపురాంతకుడు’గా అవతరించి, కార్తీక పౌర్ణమి రోజున పాశుపతాస్త్రంతో సంహరించాడు. ఆ విజయానికి గుర్తుగా ఆ రోజున దీపాలు వెలిగించాలని దేవతలను ఆజ్ఞాపించాడు. అందుకే ఈ రోజుకు ‘త్రిపుర పౌర్ణమి’ అనే పేరు వచ్చింది.

కేదారేశ్వర వ్రత మహత్యం

కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడు కేదారేశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తాడు. పూర్వం నైమిశారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకు కేదారేశ్వర వ్రత కథను వివరించాడు. వారణాసిలో నిరుపేద వైశ్య దంపతులకు భగీరథి, భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు, భగీరథుడు అనే కుమారుడు ఉండేవారు. కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ అక్కాచెల్లెళ్లు ఒకరోజు అడవిలో మర్రిచెట్టు కింద జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూసి, భక్తి మాత్రమే ప్రధానమని తెలుసుకుంటారు. ఇంటికి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి, గంగాస్నానం చేసి ఉపవాసం ఉండి పూజకు సిద్ధమవుతారు. పూజా ద్రవ్యాలు కొనే స్థోమత లేకపోవడంతో మర్రి ఆకులనే తమలపాకులుగా, మర్రి కాయలనే వక్కలుగా, మర్రి పండ్లనే బూరెలుగా, మర్రి ఊడలనే తోరణాలుగా భావించి అత్యంత భక్తిశ్రద్ధలతో కేదారేశ్వరుడిని పూజిస్తారు. వారి నిర్మల భక్తికి మెచ్చిన స్వామి కరుణతో వారి తట్టలోని కట్టెలన్నీ బంగారంగా మారిపోతాయి. ఆ సంపదతో వారి దారిద్య్రం తొలగిపోయి, ఇద్దరు కుమార్తెలకు సంపన్న కుటుంబాలలో వివాహం జరుగుతుంది.

ఆడంబరం వల్ల కలిగిన దుస్థితి

కాలక్రమేణా భగీరథుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక కార్తీక మాసంలో తమ అంతస్తుకు తగినట్లుగా వైభవంగా నోము చేయాలని భావించి, పాత పట్టు తోరాలను పెరట్లోని కాకరపాదుపై విసిరేసి బంగారు తోరాలతో ఆడంబరంగా వ్రతం చేశాడు. పూజలో వైభవం పెరిగింది కానీ భక్తి లోపించడంతో కేదారేశ్వరుని ఆగ్రహానికి గురై మళ్లీ కటిక పేదరికంలోకి జారిపోయారు. తిండికి కూడా గతిలేని స్థితిలో తల్లి పెరట్లోని కాకరకాయలను షావుకారుకు ఇచ్చి నూకలు తెమ్మని కొడుకును పంపుతుంది. ఆ కాకరకాయలలో నవరత్నాలు ఉండటం గమనించిన షావుకారు, అన్ని కాయలను తీసుకుని బియ్యం ఇస్తాడు. కాకరపాదు కాయలు అయిపోయాక మళ్లీ ఆకలి బాధ మొదలవుతుంది. తల్లి సూచన మేరకు భగీరథుడు సాయం కోసం పెద్దక్క ఇంటికి వెళ్తాడు. తమ్ముడి దీనస్థితి చూసి చలించిన భగీరథి, ఒక గుమ్మడికాయలో వరహాలు నింపి ఇస్తుంది. కానీ దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను ఎత్తుకుపోతుంది. నిరాశతో చిన్నక్క ఇంటికి వెళ్లగా, ఆమె కాలి జోళ్ళలో మాణిక్యాలు కుట్టించి ఇచ్చి, ఇంటికి వెళ్లేవరకు విడవద్దని చెబుతుంది. దారిలో చెరువు వద్ద కాళ్లు కడుక్కునే క్రమంలో ఆ చెప్పులు ఊబిలో కూరుకుపోతాయి.

జరిగినదంతా పెద్దక్కకు చెప్పి భగీరథుడు విలపించగా, ఆడంబరాలకు పోయి కేదారేశ్వరుని కరుణను కోల్పోయారని ఆమె గ్రహిస్తుంది. కుటుంబ సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా, భక్తితో వ్రతం చేయమని సూచిస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన భగీరథుడు తల్లిదండ్రులతో కలిసి మునుపటిలాగే భక్తిశ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించగా, స్వామి అనుగ్రహంతో కోల్పోయిన సంపదలను తిరిగి పొంది ప్రశాంతంగా జీవించారు. భగవంతుని ఆరాధనలో ఆడంబరాల కంటే నిష్కల్మషమైన భక్తికే ప్రాధాన్యత ఉంటుందని ఈ కథ నిరూపిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళ నదులలో దీపాలు వదలడం, శివాలయంలో రుద్రాభిషేకం చేయడం, తులసి కోట వద్ద దీపారాధన చేయడం, దానధర్మాలు చేయడం వల్ల సకల పాపాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.