Pamela Satpathy: కరీంనగర్‌లో దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం నింపేందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఒక చిన్నపాటి నిర్ణయం.. అనూహ్యంగా పెద్ద స్ఫూర్తిగా మారింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి ఆమె పాడిన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హృదయాలను హత్తుకుంటోంది. ఇది కేవలం ఒక కలెక్టర్–విద్యార్థిని కలయిక కాదు.. ప్రతిభకు కాస్త అండగా నిలిస్తే ఎంతటి మంచి ఫలితం వస్తుందో చూయిస్తోంది.
READ MORE: Mamata Banerjee: బాబ్రీ మసీదు ప్రతిపాదన తెచ్చిన ఎమ్మెల్యేపై మమత ఆగ్రహం!
ఇటీవల.. ఓ కార్యక్రమంలో సింధుశ్రీ పాడిన పాట కలెక్టర్‌ను ఎంతో ప్రభావితం చేసింది. దివ్యాంగతను కాదు, వ్యక్తిలోని ప్రతిభను చూడాలి అన్న భావన ఆమెలో బలపడింది. అదే భావనతో ఈసారి ఆమె సింధుశ్రీతో కలిసి పాట పాడాలని నిర్ణయించారు. సినీ గేయరచయిత చంద్రబోస్ రాసిన “ఆరాటం ముందు ఆటంకం ఎంత?” అనే ప్రేరణాత్మక గీతాన్ని ఇద్దరూ కలిసి ఆలపించారు. ఈ పాటను యూట్యూబ్‌లో పోస్టు చేస్తూ, దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెంచాలనే సందేశాన్ని కలెక్టర్ అందించారు. కరీంనగర్ అంధుల పాఠశాల మ్యూజిక్ టీచర్ సరళ, స్థానిక సంగీత దర్శకుడు కేబీ శర్మ మార్గనిర్దేశంలో ఈ పాట రికార్డింగ్ జరిగింది. సాదాసీదా స్టూడియోలో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు వేల మందికి ప్రేరణగా మారింది. ఇది మొదటిసారి కాదు. గతంలోనే ‘ఆడపిల్లను రక్షించుకుందాం’ సందేశంతో కలెక్టర్ పాడిన “ఓ చిన్నీ పిచుక” పాటకు అపూర్వ స్పందన వచ్చింది. సంగీతం ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలన్న ఆమె నమ్మకం మరోసారి ఫలితాన్నిచ్చింది.
