బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఆయన చిన్న కొడుకు అయిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా ఈ సంబరాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ప్రపంచ దిగ్గజాలు హాజరయ్యారు. హాలీవుడ్ స్టార్స్, అంతర్జాతీయ టెక్ అధినేతలు మరియు క్రికెటర్లు హాజరయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ అనే తేడా లేకుండా పలు సినీ పరిశ్రమలకు చెందిన స్టార్స్ పాల్గొన్నారు. ఆటపాటలతో సందడి చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీ వెడ్డింగ్ వేడుకలుగా నిలిచాయి. ఇక ఈ వేడుకల్లో సినీ తారలు డ్యాన్సులు చేయడంపై బాలీవుడ్ నటి కంగనా సెటైర్లు వేసింది. దివంగత గాయని లతా మంగేష్కర్ గతంలో చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఐదు మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినా తాను పెళ్లిళ్లలో పాటలు పాడబోనని లతా మంగేష్కర్ గతంలో తేల్చి చెప్పారు. ఆ వార్తకు సంబంధించిన పేపర్ కటింగ్ ను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా కంగనా షేర్ చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా లతా మంగేష్కర్ మాదిరిగానే వ్యవహరిస్తానని చెప్పుకొచ్చింది. ఎన్నో చక్కటి ఆఫర్లు వచ్చినప్పటికీ, పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకలలో ప్రదర్శన ఇచ్చేందుకు ఒప్పుకోలేదని ఆమె వెల్లడించింది. “నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ, కొన్ని నిర్ణయాలను ఎప్పుడూ కూడా మార్చుకోలేదు. పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకలలో ప్రదర్శనలు ఇవ్వడానికి చాలా ఆఫర్లు వచ్చాయి. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్లు కూడా వచ్చాయి. నాకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించారు. కానీ, నేను వాటికి దూరంగా ఉన్నాను. ఇక ముందు కూడా అలాగే ఉంటాను. డబ్బు కంటే గౌరవం ముఖ్యం అని నేను బలంగా నమ్ముతాను. అందుకే, డబ్బుల కట్టలు వస్తున్నా వద్దు అనుకున్నాను. యువత కూడా అర్థం చేసుకోవాలి. షార్ట్స్ కట్స్ అస్సలు మంచిది కాదు. ఆ దారిలో వెళ్తే ఇబ్బందులు తప్పవు” అని కంగనా చెప్పుకొచ్చింది.
