రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఈ కథను మరింత లోతుగా, మరింత భారీగా చూపేందుకు సీక్వెల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న కొన్ని క్రేజీ లీక్స్ సినీ ప్రియుల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.
ఈ సీక్వెల్‌లో ఒక పవర్‌ఫుల్ స్పెషల్ రోల్ ఉందని, అది సినిమా క్లైమాక్స్‌లో వస్తుందని సమాచారం. ఆ పాత్రలో తమిళ స్టార్ హీరో శింబు నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. శింబు ఈ చిత్రంలో భాగమైతే, తమిళ మార్కెట్‌లో ఈ సినిమాకు తిరుగుండదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొదటి భాగం చివర్లో ప్రభాస్ పాత్రను కర్ణుడిగా పరిచయం చేసి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు నాగ్ అశ్విన్. దీనికి కొనసాగింపుగా రాబోయే సీక్వెల్‌కు ‘కర్ణ 3102 బీసీ’ (Karna 3102 BC) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మొదటి భాగంలో కల్కి ఆగమనాన్ని చూపిస్తే, రెండో భాగంలో పూర్తిగా కర్ణుడి గత చరిత్ర, అతని పునరాగమనం, శతాబ్దాల నాటి కథాంశంపై దృష్టి సారించనున్నారట.
హైదరాబాద్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఒక భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (సుప్రీం యాస్కిన్) మధ్య వచ్చే ఒక అదిరిపోయే యాక్షన్ సీన్‌ను షూట్ చేయనున్నారట. ఈ సీక్వెల్‌లో పురాణాలకు సంబంధించిన సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉంటుందని, ఇది ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ కానుందని సమాచారం.
