Site icon NTV Telugu

Ajay Manikrao: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా మానిక్‌రావ్ నియామకం

Justice

Justice

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మానిక్​రావ్​ ఖాన్విల్కర్‌కు (Justice Ajay Manikrao Khanwilkar) కీలక పదవి దక్కింది. ఆయన లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

జస్టిస్ ఖాన్విల్కర్ 2022 జులైలో సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేశారు. మాజీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్ , జస్టిస్ రితు రాజ్ అశ్వతీను లోక్‌పాల్ న్యాయ సభ్యులుగా రాష్ట్రపతి నియమించారు. అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌లో సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కీ నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు.

కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. పబ్లిక్‌ సర్వెంట్లలో కొన్ని విభాగాల వారిపై వచ్చే అవినీతి కేసులపై దృష్టిపెట్టడం వీటి విధి.

లోక్‌పాల్‌ కమిటీలో ఒక ఛైర్‌పర్సన్, గరిష్ఠంగా 8 మంది సభ్యులు ఉండాలి. వీరిలో నలుగురు జ్యుడీషియల్‌ సభ్యులై ఉండాలి. లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా నియమిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వంలో గల ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారు. లోక్‌సభ స్పీకర్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన ప్రతిపాదించిన న్యాయమూర్తి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రపతి లేదా మరేదైనా ఇతర సభ్యుడు నామినేట్‌ చేసిన ప్రముఖ న్యాయకోవిదుడు కూడా సభ్యుడిగా ఉంటారు.

2022 మే 27న లోక్​పాల్​ ఛైర్‌పర్సన్​గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పదవీకాలం పూర్తయ్యింది. ఆ తర్వాత లోక్‌పాల్​ రెగ్యులర్ ఛైర్​పర్సన్​గా కేంద్రం ఎవర్ని నియమించలేదు. ఇప్పటవరకు జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి లోక్​పాల్ తాత్కాలిక ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. తాజా నియామకంతో ఆ భర్తీ లోటు తీరింది.

ఛైర్‌పర్సన్‌, ఇతర సభ్యులు ఐదేళ్లు లేదా 70 ఏళ్లు వయసు వచ్చేవరకూ పదవుల్లో కొనసాగుతారు.
సభ్యుల జీత భత్యాలు సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఇచ్చే రీతిలోనే ఉంటాయి.

 

Exit mobile version