NTV Telugu Site icon

INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 ఆలౌట్

5

5

అనుకున్నదే జరిగింది. ఆస్ట్రేలియా టీమ్ భయమే నిజమైంది. స్పిన్‌కు అనుకూలించే నాగ్‌పూర్ పిచ్‌పై తొలిరోజే టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 177 రన్స్‌కు ఆలౌటైంది. లబుషేన్ (49) కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా.. స్మిత్ (37), అలెక్స్ కారే (36), హ్యాండ్స్‌కాంబ్ (31) కాసేపు పోరాటం చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో దుమ్మురేపగా, అశ్విన్ (3), షమీ, సిరాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

స్మిత్, లబుషేన్ పోరాటం

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు పరుగులు చేసేందుకు నానా తిప్పలు పడింది. ఓపెనర్లు వార్నర్ (1), ఖవాజా (1)లను ఆదిలోనే పేసర్లు షమీ, సిరాజ్ పెవిలియన్ పంపి జట్టుకు శుభారంభాన్ని అందించారు. అనంతరం లబుషేన్ (49), స్మిత్ (37) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో కెప్టెన్ రోహిత్ బౌలింగ్‌లో మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి కంగారూ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 32 ఓవర్లలో 76 రన్స్ చేసింది.

స్పిన్ ఉచ్చులో చిక్కుకుని

రెండో సెషన్‌లో మాత్రం టీమిండియా స్పిన్నర్లు జూలు విదిల్చారు. వరుసగా వికెట్లు తీస్తూ ఆసీస్ పతనాన్ని శాసించారు. మూడో వికెట్‌కు 82 రన్స్ జోడించిన అనంతరం లబుషేన్‌ను జడేజా పెవిలియన్ పంపాడు. అనంతరం ఇదే ఓవర్లో మ్యాట్ రెన్‌షా (0)లను ఔట్ చేసి మరోసారి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇక కుదురుంటున్న స్మి్‌త్‌ను జడ్డూ ఔట్ చేయగా.. కాస్త దూకుడు చూపించిన అలెక్స్ కారే (36)ను అశ్విన్ బుట్టలో వేసుకున్నాడు. ఇక కెప్టెన్ కమిన్స్‌ (6), టాడ్ మర్ఫీ (0) వరుస ఓవర్లలో ఔటవడంతో టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 60 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 రన్స్ చేసింది. మూడో సెషన్ మొదలవగానే హ్యాండ్స్‌కాంబ్ (31)ను జడేజా వెనక్కి పంపగా.. బోలాండ్ (1)ను ఔట్ చేసి అశ్విన్.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

Also Read: Same day Release: ఒకే హీరో… ఒకే రోజు… రెండు సినిమాలు!

Show comments