Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!

Road Accident

Road Accident

Road Accident for Jabardasth Actors: తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం… జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు ప్రయాణిస్తున్న కారు కాకినాడ నుంచి భీమవరం వైపు వెళ్తుండగా, పెన్నాడ అగ్రహారం వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దొరబాబు, రైజింగ్ రాజులతో పాటు కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి, మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో) పాల్గొనేందుకు వీరు భీమవరం వెళ్తున్నట్లు సమాచారం. అయితే, కారు అదుపుతప్పడానికి గల ఖచ్చితమైన కారణాలు, అతివేగం లేదా రోడ్డు పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇరువురికి ప్రమాదం జరిగిందన్న వార్త తెలియడంతో బుల్లితెర వర్గాలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, వారు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.