Site icon NTV Telugu

ISRO Gaganyaan mission: ఇస్రో సూపర్ సక్సెస్.. ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం

06

06

ISRO Gaganyaan mission: భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఇస్రో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. గగన్‌యాన్ మిషన్ కోసం చాలా ముఖ్యమైన మొదటి ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01)ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ పరీక్షలో పారాచూట్ ఆధారిత వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షించారు. దీంతో అంతరిక్షం నుంచి తిరిగి వచ్చేటప్పుడు భారతీయ వ్యోమగాములు సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చూసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

READ ALSO: Film Federation : సినీ కార్మికులందరికీ వేతనాలు పెరిగాయ్.. కానీ వాళ్లకు?

విజయవంతంగా పరీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వైమానిక స్థావరం నుంచి ఈ పరీక్షను వైమానిక దళం, DRDO, నౌకాదళం, కోస్ట్ గార్డ్ సహకారంతో ఇస్రో నిర్వహించింది. అనంతరం గగన్‌యాన్ మిషన్ కోసం పారాచూట్ ఆధారిత డిసిలరేషన్ సిస్టమ్ మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01) విజయవంతమైందని ఇస్రో ‘X’లో పోస్ట్ చేసింది. ఈ విజయం అన్ని సహకార సంస్థల ఉమ్మడి ప్రయత్నాల ఫలితం అని పేర్కొంది. ఇస్రో చీఫ్ వి.నారాయణన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గగన్‌యాన్ తొలి మానవరహిత ప్రయోగం (జి1 మిషన్) ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగుతుందని ప్రకటించారు. ఈ ప్రయోగంలో హాఫ్ – హ్యూమనాయిడ్ రోబోట్ ‘వ్యోమిత్ర’ అంతరిక్షంలోకి ప్రయాణిస్తుందని తెలిపారు. గగన్‌యాన్ మిషన్ పనిలో దాదాపు 80% పూర్తయిందని, ఇప్పటి వరకు దాదాపు 7,700 పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన 2,300 పరీక్షలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని వెల్లడించారు.

ఈ ప్రయోగంలో భాగంగా మాడ్యూల్ నమూనాను హెలికాప్టర్ సాయంతో నింగిలోకి తీసుకెళ్లి.. కిందికి జారవిడిచారు. పారాచూట్ల సాయంతో ఆ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ. సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల సమయంలో వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మాడ్యూల్ భూవాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం దాని వేగ నియంత్రణ, ల్యాండింగ్ విషయంలో పారాచూట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్టమైన ఈ వ్యవస్థ పనితీరును పరీక్షించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు సమాచారం. CES ను పరీక్షించడానికి ఇస్రో ఇప్పటికే టెస్ట్ వెహికల్-D1 (TV-D1) ను ప్రారంభించింది. ఇప్పుడు TV-D2, IADT-01 కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీనితో పాటు గ్రౌండ్ నెట్‌వర్క్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా సిద్ధం చేశారు. నౌకాదళం, కోస్ట్ గార్డ్‌ను చేర్చుకోవడం ద్వారా రికవరీ ప్రణాళికను రూపొందించారు.

గగన్‌యాన్-1 తర్వాత భారతదేశం తన మొదటి మానవ సహిత గగన్‌యాన్ మిషన్‌ను 2027లో నిర్వహిస్తుంది. దీని తర్వాత 2028లో చంద్రయాన్-4, ఆ తర్వాత వీనస్ మిషన్, 2035 నాటికి భారతదేశం తన సొంత ‘భారత్ అంతరిక్ష కేంద్రం’ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి భారతదేశం తన మొదటి వ్యోమగామిని చంద్రునిపైకి పంపడానికి సన్నాహాలు చేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

READ ALSO: Bihar elections: బిహార్‌ ఓటర్‌ లిస్ట్‌లో ఇద్దరు పాకిస్థానీ మహిళలు.. కేంద్రం సీరియస్

Exit mobile version