Site icon NTV Telugu

Condoms Shortage: యుద్ధ ప్రభావం.. భారీగా ఏర్పడిన కండోమ్‌ల కొరత..

Condomssss

Condomssss

మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధ జ్వాలలు కేవలం ఆయుధాలకు, సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యుల పడకగది వరకు చేరుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో, రానున్న రోజుల్లో కండోమ్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ముడిసరుకుల కొరత..

కండోమ్‌ల తయారీలో అత్యంత కీలకమైన పదార్థాలు సిలికాన్ ఆయిల్ , అమ్మోనియా. కండోమ్‌లు మృదువుగా ఉండటానికి… లూబ్రికేషన్ కోసం సిలికాన్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. యుద్ధ వాతావరణం వల్ల దీని ఉత్పత్తి, దిగుమతి నిలిచిపోయింది. దీనికి తోడు, కండోమ్ తయారీలో వాడే లాటెక్స్ (రబ్బరు పాలు) గడ్డకట్టకుండా, చిరిగిపోకుండా ఉండటానికి అమ్మోనియాను వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ అమ్మోనియా ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 40 శాతానికి పైగా పెరగడం తయారీదారులకు పెను భారంగా మారింది.

హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరాకు బ్రేక్..

ప్రపంచవ్యాప్తంగా అమ్మోనియా అవసరాల్లో సుమారు 86 శాతం గల్ఫ్ దేశాల నుంచే తీరుతాయి. అయితే.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం ‘హార్ముజ్ జలసంధి’ మూసివేశారు. దీనివల్ల సరుకు రవాణా నౌకలు నిలిచిపోయాయి. రవాణా ఖర్చులు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు అధికమవ్వడం వల్ల ముడిసరుకు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది నేరుగా తయారీ రంగంపై ప్రభావం చూపుతోంది.

నిత్యావసరాలపై కూడా..

సాధారణంగా యుద్ధం అంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అందరూ భావిస్తారు. కానీ, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండటం వల్ల.. ఇలాంటి ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులపై కూడా ప్రభావం పడుతోంది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ స్థిరంగా ఉండటంతో కండోమ్‌ల ధరలు రానున్న కాలంలో సామాన్యుడికి భారమవ్వచ్చు. కుటుంబ నియంత్రణపై కూడా ఇది పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య పోరు ప్రపంచ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. ముడిసరుకుల లభ్యత మెరుగుపడితే తప్ప ఈ ధరల సెగ తగ్గేలా కనిపించడం లేదు.

Exit mobile version