Site icon NTV Telugu

Lashkar-E-Taiba ISKP Alliance: పాక్ ఐఎస్ఐ కొత్త కుట్ర.. భారత్‌కు ప్రమాదం పొంచి ఉందా!

Pakistan Isi Terror Plot

Pakistan Isi Terror Plot

Lashkar-E-Taiba ISKP Alliance: పాకిస్థాన్‌లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ప్రమాదకరమైన కూటమి పురుడుపోసుకుందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల వెలువడిన పలు నిఘా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ నిఘా సంస్థ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ (ISI), రెండు భయంకరమైన ఉగ్రవాద సంస్థలను ఒకచోట చేర్చిందని సమచారం. ఆ భయంకరమైన ఉగ్రవాద సంస్థలు.. లష్కరే తోయిబా (LeT), ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)లు అని నిఘా నివేదికలు పేర్కొన్నాయి. ఈ కొత్త కూటమి ఆఫ్ఘనిస్థాన్‌లోని బలూచ్ తిరుగుబాటుదారులకు, తాలిబాన్ వ్యతిరేక గ్రూపులకు ముప్పుగా ఉండటమే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తిరిగి రెచ్చగొట్టడానికి అనుగుణంగా ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

READ ALSO: Harish Rao : రేవంత్ రెడ్డి మాటల్లో ఫేకుడు.. చేతల్లో జోకుడు

కొత్త జట్టును లీక్ చేసిన ఫోటో..
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఫోటోలో ISKP బలూచిస్థాన్ కోఆర్డినేటర్ మీర్ షఫీక్ మెంగల్, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ రాణా మొహమ్మద్ అష్ఫాక్‌కు పిస్టల్ అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోతో రెండు ఉగ్రవాద సంస్థల మధ్య ఇప్పుడు అధికారిక సమన్వయం ఏర్పడిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక పాకిస్థాన్ ISI నేరుగా ఉందని భద్రతా సంస్థలు పేర్కొంటున్నాయి.

వాళ్లిద్దరూ ఎవరు..
తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోలో ISKP బలూచిస్థాన్ కోఆర్డినేటర్ మీర్ షఫీక్ మెంగల్, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ రాణా మొహమ్మద్ అష్ఫాక్‌ కనిపించారు. ఇంతకీ వీళ్లు ఎవరో తెలుసా.. మీర్ షఫీక్ మెంగల్.. బలూచిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి నాసిర్ మెంగల్ కుమారుడు. అలాగే ఆయనను బలూచ్ జాతీయవాదులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంలో పాల్గొన్న ISI “ప్రైవేట్ డెత్ స్క్వాడ్” నాయకుడిగా చాలా కాలంగా పేర్కొంటున్నారు. 2015 నుంచి ఆయన ISKPకి ప్రధాన నిధులు, ఆయుధ సరఫరాదారుగా ఉన్నారు. పాకిస్థాన్ సొంత దర్యాప్తు సంస్థల 2015 JIT నివేదికలో కూడా ఆయన పేరు ఉంది. రాణా మొహమ్మద్ అష్ఫాక్.. లష్కరే తోయిబా ప్రస్తుత నజీమ్-ఎ-ఆలా, ఆయన పాకిస్థాన్ అంతటా కొత్త శిక్షణ, బ్రెయిన్‌వాషింగ్ కేంద్రాలను (మర్కజ్) తెరవడానికి బాధ్యత వహిస్తున్నారు.

బలూచిస్థాన్‌లో కొత్త కూటమి ఎంట్రీ..
పలు నివేదికల ప్రకారం.. ISI సహాయంతో ఇప్పటికే ISKP మస్తుంగ్, ఖుజ్దార్ జిల్లాల్లో రెండు ప్రధాన కార్యాచరణ స్థావరాలను ఏర్పాటు చేసింది. మీర్ మెంగల్ ఈ శిబిరాలకు నాయక్వతం వహిస్తున్నారు. అలాగే ఆయన ఆధ్వర్యంలోనే వీటికి ఆయుధాలు, డబ్బులు సరఫరా జరుగుతున్నాయి. మార్చి 2025లో బలూచ్ తిరుగుబాటుదారులు మస్తుంగ్ శిబిరంపై దాడి చేసి 30 మందికి పైగా ISKP ఉగ్రవాదులను చంపారు. ఈ ఘటన తరువాత లష్కరే తోయిబాను జోక్యం చేసుకోవాలని ISI నేరుగా ఆదేశించిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జూన్ 2025లో ఎల్‌ఇటి చీఫ్ రాణా అష్ఫాక్ స్వయంగా బలూచిస్థాన్‌కు చేరుకుని అక్కడ ఒక జిగ్రా (సమావేశం) నిర్వహించారు. అనంతరం ఆయన బలూచ్ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించారు. ఎల్‌ఇటి డిప్యూటీ సైఫుల్లా కసూరి కూడా పాకిస్థాన్‌ను వ్యతిరేకించే వారిని నిర్మూలిస్తామని ప్రకటించారు. బలూచిస్థాన్‌లో లష్కరే ఉనికి కొత్తది కాదు. దాని మర్కజ్ తఖ్వా చాలా ఏళ్లుగా క్వెట్టాలో పనిచేస్తోంది. 2002 – 2009 మధ్య, లష్కరే శిక్షణా శిబిరం అక్కడే ఉంది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ కూడా ఇక్కడ ఆయుధ శిక్షణ పొందాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

భారత్‌పై ప్రమాదకరమైన కుట్ర..
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ISKP ప్రచార పత్రిక యల్గర్ తాజా సంచికల్లో కాశ్మీర్‌లో కార్యకలాపాలను పెంచాలని పిలుపునిచ్చాయి. పాకిస్థాన్ ఇప్పుడు ఈ కూటమిని భారతదేశానికి వ్యతిరేకంగా కూడా ఉపయోగించాలని యోచిస్తోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ISI ఇప్పుడు తన హైబ్రిడ్ యుద్ధ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి విభిన్న సిద్ధాంతాలు కలిగిన ఉగ్రవాద సంస్థలను ఏకం చేయాలని చూస్తుందని, దాని ద్వారా ఒక సాధారణ నెట్‌వర్క్‌ను నిర్మిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దక్షిణాసియా భద్రతకు కొత్త కూటమి ముప్పు..
లష్కరే తోయిబా, ఐఎస్‌కెపిలతో ఏర్పడిన ఈ కొత్త కూటమి దక్షిణాసియా భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఇప్పుడు ఈ సంస్థలను ఆఫ్ఘనిస్థాన్‌లోని బలూచ్ తిరుగుబాటుదారులు, తాలిబాన్ వ్యతిరేక గ్రూపులపై మాత్రమే కాకుండా, కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి కూడా వాడుకోడానికి సిద్ధమవుతుందని తెలిపాయి. బలూచిస్థాన్ నుంచి వెలువడిన పలు చిత్రాలు, ఈ కొత్త కూటమి పాక్ కొత్త ప్రమాదకరమైన ఉగ్రవాద విధానాన్ని బహిర్గతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: YS Jagan: ముఖ్యమంత్రికి పాలన మీద కాదు.. సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే ధ్యాస!

Exit mobile version