NTV Telugu Site icon

IPL Auction 2024: నేడే ఐపీఎల్‌ మినీ వేలం.. అదృష్టం పరీక్షించుకోనున్న 333 మంది ఆటగాళ్లు! జాక్‌పాట్‌ ఎవరికో

Ipl 2024

Ipl 2024

IPL Auction 2024 Live Updates: ప్రతీ ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. లీగ్‌ వేలంపై కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఏ ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది, పాలనా ప్లేయర్ ఎన్ని కోట్లు కొల్లగొడుతాడు, అత్యధిక ధర ఎవరికి దక్కుతుంది, ఏ అనామక క్రికెటర్ జాక్‌పాట్‌ కొడతాడు అనే చర్చలు సాగుతూనే ఉంటాయి. ఇలాంటి ఆసక్తికర సన్నివేశాల కోసం మరోసారి ఐపీఎల్‌ 2024 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. 333 మంది క్రికెటర్లు నేడు జరిగే వేలంలో అందుబాటులో ఉన్నారు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు మినీ వేలానికి రంగం సిద్ధమైంది. తొలిసారిగా భారత్‌ వెలుపల ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు. మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జరుగనుంది. 2025లో జరిగే మెగా వేలానికి ముందు ఇదే చివరి ఆక్షన్‌. ఈ వేలం స్టార్‌స్పోర్ట్స్‌, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మినీ వేలం కాబట్టి ఈ రోజే పూర్తవనుంది.

ఐపీఎల్‌ 2024 వేలంలో మొత్తం 333 మంది ప్లేయర్స్ బరిలో ఉన్నారు. ఇందులో 214 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 119 మంది విదేశీయుల్లో ఇద్దరు అసోసియేట్‌ దేశాల నుంచి ఉన్నారు. 10 ప్రాంఛైజీలు కలిపి 77 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందులో 30 విదేశీ ఆటగాళ్ల కోటా స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్‌ మార్చి 22న ఆరంభమయ్యే అవకాశముంది.

ఐపీఎల్‌ 2024 వేలంలో మొత్తంగా 8 కనీస ధరలతో ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఇందులో గరిష్ఠ ధర రూ.2 కోట్లు. గరిష్ఠ ధర ఉన్న ఆటగాళ్లపై కాసుల వర్షం కురావనుంది. ఎనిమిదేళ్ల తర్వాత వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా పేసర్‌ స్టార్క్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశముంది. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర, ట్రావిస్‌ హెడ్‌ కూడా భారీ ధర సొంతం చేసుకునేలా కనిపిస్తున్నారు. కొయెట్జీ, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, హసరంగల కోసం గట్టి పోటీ ఖాయమే. స్మిత్‌, ఇంగ్లిస్‌, వోక్స్‌, ఫెర్గూసన్‌, హేజిల్‌వుడ్‌, పావెల్‌, డరైల్‌ మిచెల్‌, బ్రేస్‌వెల్‌, మదుశంక, షంసి, కేశవ్‌ సహా భారత్‌ నుంచి శార్దూల్‌, హర్షల్‌, షారుక్‌, చేతన్‌ సకారియాలపై ప్రాంఛైజీలు దృష్టి సారించవచ్చు.

Also Read: Viral Video: బస్సును ఆపేందుకు బానెట్‌పైకి ఎక్కిన యువకుడు.. 4 కిమీ దూసుకెళ్లిన డ్రైవరు! వీడియో వైరల్‌

ఐపీఎల్‌ 2024 వేలంలోకి గుజరాత్‌ టైటాన్స్‌ అత్యధిక డబ్బుతో అడుగుపెడుతోంది. గుజరాత్‌ ఖాతాలో రూ. 38.15 కోట్లు ఉండగా.. గరిష్ఠంగా ఎనిమిది (ఇద్దరు విదేశీయులు) మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద రూ. 34 కోట్లు ఉండగా.. జట్టులో 6 ఖాళీలు (ముగ్గురు విదేశీయులు) ఉన్నాయి. అత్యల్పంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ వద్ద రూ.13.15 కోట్లు ఉండగా.. 6 ఖాళీలు (ఇద్దరు విదేశీయులు) ఉన్నాయి. ఇక 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా వేలాన్ని ఓ మహిళ నిర్వహించనున్నారు. ఇటీవల మహిళల ప్రిమియర్‌ లీగ్‌ వేలాన్ని నిర్వహించిన మల్లిక సాగర్‌.. ఐపీఎల్‌ 2024 వేలంలోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.